Begin typing your search above and press return to search.

మేకపాటి కుటుంబంలో ఆ లేఖ కలకలం.. నన్ను కొడుకుగా ఒప్పుకో!

By:  Tupaki Desk   |   7 Jan 2023 7:30 AM GMT
మేకపాటి కుటుంబంలో ఆ లేఖ కలకలం.. నన్ను కొడుకుగా ఒప్పుకో!
X
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పట్టు ఉన్న కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డి రాజకీయాల్లో రాణించారు. మంత్రిగా ఉంటూ మరణించిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఆత్మకూరు నుంచి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

అలాంటి మేకపాటి కుటుంబంలో ఇప్పుడు ఒక లేఖ కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004, 2009, 2012 (ఉప ఎన్నిక), 2019లో ఆయన ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు చేతిలో ఓడిపోయారు.

కాగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుటుంబంలో తాజాగా ఓ లేఖ కలకం రేపుతోంది. తమను 18 ఏళ్లు రహస్యంగా ఉంచి విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్‌ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. తనకు కుమారుడే లేడని ఇటీవల మేకపాటి చంద్రశేఖరరెడ్డి చెప్పడంపై శివచరణ్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీకు కొడుకు లేకపోతే నేను ఎవరిని అంటూ ఆ లేఖలో శివచరణ్‌ రెడ్డి.. చంద్రశేఖరరెడ్డిని ప్రశ్నించారు.

చదువుకి ఫీజులు చెల్లిస్తే తండ్రి బాధ్యత తీరిపోతుందా అంటూ ఆ లేఖలో శివచరణ్‌ రెడ్డి సూటి ప్రశ్నలు సంధించాడు. తన తల్లి తర్వాత పరిచయమైన మహిళను మాత్రం భార్యగా సమాజానికి పరిచయం చేశావంటూ లేఖలో చంద్రశేఖర్‌రెడ్డిని శివచరణ్‌ రెడ్డి నిలదీశాడు.

ఈ వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఆ బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ లేఖతో పాటు పాత ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

తాను మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనయుడిని అంటూ శివచరణ్‌ రెడ్డి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. కుమారుడిగా తనని ఒప్పుకోవాలంటూ శివచరణ్‌ రెడ్డి డిమాండ్‌ చేస్తున్నాడు.

మరోవైపు ఈ బహిరంగ లేఖపై ఇప్పటివరకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారు? అనే విషయం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మేకపాటి కుటుంబంలో ఈ లేఖ కలకలం సృష్టిస్తోందని చెప్పుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.