Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే సోదరుడు దళితబంధు లబ్థిదారుడు.. ఇలా అయితే ఎలా కేసీఆర్?

By:  Tupaki Desk   |   29 March 2022 4:05 AM GMT
ఆ ఎమ్మెల్యే సోదరుడు దళితబంధు  లబ్థిదారుడు.. ఇలా అయితే ఎలా కేసీఆర్?
X
పేదల బతుకుల్ని మార్చే సంక్షేమ పథకాలంటూ ప్రభుత్వాలు చెప్పుకునే బడాయి మాటలకు.. వాస్తవానికి మధ్యనున్న అంతరం ఎంతన్న విషయం కొన్ని సందర్భాల్లో బయటకు వస్తుంటుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో దళితబంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్ సర్కారు.. తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాంగా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పథకం కింద ఎంపికై లబ్థిదారుడికి ఏకంగా రూ.10లక్షలు ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ మొత్తంతో వారి బతుకులు మారిపోతాయన్న వాదనను వినిపిస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.

అయితే.. ఈ పథకంలో భాగంగా లబ్థిదారులకు ఇచ్చే రూ.10లక్షలు ఎవరికి వెళుతున్నాయి? వారు దేని కోసం ఖర్చు చేస్తున్నారు? పథకం ద్వారా లబ్థి పొందిన వారిపై ఎలాంటి నిఘా ఉంటుందన్న దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం.. ఎంపిక వేళలోనే దొర్లుతున్న తప్పులు ఈ పథకం అమలుపైన సరికొత్త సందేహాల్ని తీసుకొచ్చేలా మారుస్తోంది.

పేరుకు దళితబంధే కానీ.. దాని లబ్థిదారుల ఎంపికలో పెద్ద గోల్ మాల్ నడుస్తోందన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ పథకం అమలు విషయంలో ప్రజాప్రతినిధులు కీలక భూమిక పోషిస్తున్నారని.. చాలామంది నాయకులు తమ అనుచరులకే ఈ పథకానికి లబ్థిదారులుగా చేస్తున్నట్లుగా ఆరోపనలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్లే.. తాజాగా ఒక ఉదంతం వెలుగు చూసింది.

తాజాగా జనగమా జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్థిదారుల జాబితాలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే.. మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు సురేశ్ కుమార్ పేరు ఉండటం గమనార్హం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆయన ఘన్ పూర్ సర్పంచ్ కూడా. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే సోదరుడిని దళితబంధు లబ్థిదారుడిగా ఎలా ఎంపిక చేస్తారని అధికారుల్ని ప్రశ్నిస్తే.. వారిచ్చిన సమాధానం వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే.

దళితబంధు పథకంలో ఎస్సీలకు ఇవ్వాలన్న నిబంధన ఉండే కానీ.. పేదలకే ఇవ్వాలని ప్రత్యేకంగా పేర్కొనలేదని.. ప్రభుత్వ ఉద్యోగులకు కాని 60 ఏళ్ల లోపు వారంతా అర్హులేనని చెబుతున్నారు. పేరుకు దళితబంధు అయినా.. దాని లబ్థిదారులు ఎవరన్న విషయాన్ని తాజా ఉదంతం ఇట్టే చెప్పేస్తుందన్న మాట వినిపిస్తోంది.