Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ నోటి తీట.. భగత్ సింగ్ మీద ఇలాంటి వ్యాఖ్యలా?

By:  Tupaki Desk   |   16 July 2022 5:08 AM GMT
ఆ ఎంపీ నోటి తీట.. భగత్ సింగ్ మీద ఇలాంటి వ్యాఖ్యలా?
X
ఇప్పుడో సిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖులు పలువురు తమకున్న చిట్టి మెదడుకు తోచింది వెనుకా ముందు ఆలోచించకుండా తమ ఆలోచనల్ని బయటకు చెప్పేస్తున్నారు. ఎంత వివాదాస్పదంగా మాట్లాడితే అంత పాపుల్ అవుతామన్నట్లుగా వారి తీరు ఉంటోంది.

తాజాగా అలాంటి పనే చేశారు శిరోమణి అకాళీ దళ్ (అమృత్‌సర్‌) చీఫ్ కమ్ ఇటీవల సంగ్రూర్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికైూన 77 ఏళ్ల సిమ్రన్ జిత్ సింగ్ మాన్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. స్వాతంత్య్ర సమరంలో తమ ప్రాణాల్ని లెక్క చేయక.. దేశం కోసం తమ ప్రాణాల్ని బలిచ్చిన భగత్ సింగ్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

'యువకుడైన ఒక ఇంగ్లిష్ అధికారిని భగత్ సింగ్ చంపాడు. సిక్కు కానిస్టేబుల్ ఛన్నన్ సింగ్ నూ హతమార్చాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఇప్పుడు చెప్పండి.. భగత్ సింగ్ ఉగ్రవాదా? కాదా?' అంటూ వ్యాఖ్యానించారు. ఖలిస్థాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసే ఈ పెద్ద మనిషికి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం కొత్తేం కాదు. అయితే.. భగత్ సింగ్ ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార ఆప్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

స్వాతంత్య్ర సమరయోధుడ్ని ఉద్దేశించి ఉగ్రవాదిగా అభివర్ణించిన వైనంపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఖండించింది. ఎంపీ వ్యాఖ్యలు సిగ్గుమాలిన చర్యలుగా పేర్కొంది. మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడటం.. ఒక వీరుడ్ని అవమాన పరిచేలా మాట్లాడినందుకు అతగాడు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ చేసింది.

77ఏళ్ల ముదిమి వయసులో వచ్చిన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన మెదడు ఏ రీతిలో పని చేస్తుందో అర్థమవుతుంది. అంతేకాదు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఈ ఎంపీ అలవాటుగా చెబుతారు.

తాను ఎంపీగా గెలిచినంతనే ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. కశ్మీర్ లో భారత ఆర్మీ దారుణాల్ని పార్లమెంటులో వినిపిస్తానని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి.. ప్రజల కట్టిన పన్ను సొమ్ముతో జీతాలు.. భద్రత కల్పించటం లాంటివి జరగటమే అసలు విషాదంగా చెప్పక తప్పదు.