Begin typing your search above and press return to search.

తిరుపతిలో బీజేపీ ఓటమి తథ్యం ఓటమికి ఆ ప్రకటనే కీలక : కత్తి మహేష్

By:  Tupaki Desk   |   29 March 2021 10:30 AM GMT
తిరుపతిలో బీజేపీ ఓటమి తథ్యం ఓటమికి ఆ ప్రకటనే కీలక : కత్తి మహేష్
X
తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించడానికి బీజేపీ అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే వ్యూహాత్మకంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను బరిలోకి దించిన కమలదళం, ఆమెను గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రత్నప్రభ విజయానికి మాదిగ నేతలు ఏకమౌతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో సైద్ధాంతిక పరంగా అనేక విభేదాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పక్కన పెట్టి రత్నప్రభను గెలిపించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాదిగ నేతలు ఒకే వేదిక మీదికి వచ్చే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

అందులో ముఖ్యంగా తెలంగాణకు చెందిన ప్రముఖ మాదిగ నేత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చీఫ్ మంద కృష్ణ మాదిగ, రత్నప్రభ కోసం తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగొచ్చని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ రావాల్సింది ఉంది. మాదిగ సామాజిక వర్గానికే చెందిన కత్తి మహేష్ కూడా రత్నప్రభ కోసం ప్రచారానికి రావొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రత్నప్రభతో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలతో కలిసి ఆయన రత్నప్రభతో సమావేశమయ్యారు. రత్నప్రభతో సమావేశమైన అనంతరం తన ఫేస్‌ బుక్ అకౌంట్ ‌లో కత్తి మహేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో మాదిగ నాయకత్వం లేదని, మాదిగలలో ఐకమత్యం లేదని ,ఆర్ధిక వనరులు అంతకన్నా లేవని స్పష్టం చేశారు. స్థానికి మాలలతో పాటు తమిళ మాలలదే ఇక్కడ తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారని, అందుకే అన్ని రాజకీయ పార్టీలు మాలలకే ప్రాధాన్యత ఇస్తాయని స్పష్టం చేశారు.

అంతమాత్రంతో ఓడిపోయే సీటులో బీజేపీ లాంటి దళిత వ్యతిరేక పార్టీ నిలబెట్టిన స్థానికేతర మాదిగ మాజీ ఐఏఎస్ అధికారిణికి ఓటు వెయ్యాలనే వాదనలో చాలా లోపం ఉందని కత్తి మహేష్ చెప్పారు. మాదిగలకు రెప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి, మొత్తంగా దళితులకే అన్యాయం చేసే బీజేపీకి ఓటెయ్యడం, తన మనసుకి నచ్చదని తేటతెల్లం చేశారు. తిరుపతిలో గెలిస్తే పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ ఓడిపోవడానికి ఈ ప్రకటన ఒక్కటి చాలని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరుకు రెఫరెండంగా తీసుకుంటామంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. అలాగే తిరుపతిలో బీజేపీ ఓటమి తప్పదు అని తెలిపారు.