Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు అయితే ఆ మాత్రం ఉండదా?

By:  Tupaki Desk   |   13 Dec 2022 4:44 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు అయితే ఆ మాత్రం ఉండదా?
X
రాత్రి వేళ.. అది కూడా కేసులో విచారణ కోసం అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన వారి కోసం రావటం.. ఆ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఎవరినీ రానివ్వకుండా చూసుకోవటం.. మీడియా ప్రతినిధులు వచ్చే ప్రయత్నం చేస్తే.. వారికి వార్నింగ్ ఇవ్వటం.. వీడియోలు.. ఫోటోలు తీసిన వారిని బెదిరించి డిలీట్ చేయటం లాంటివి చేసిందెవరో తెలుసా? ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు. నిజమే.. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళ.. ఎమ్మెల్యే సోదరుడు ఆ మాత్రం హవా నడిపించకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

పోలీసుల్ని అధికారపార్టీ వారు ఏ తీరులో వాడుతున్నారో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు. ఒక కేసులో భాగంగా అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తీసుకురాగా.. ఎమ్మెల్యే సోదరుడు తన అనుచరులతో స్టేషన్ కు రావటమే కాదు.. స్టేషన్ లోపల పంచాయితీ పెట్టిన తీరు విస్తుపోయేలా చేసింది. మంది మార్బలంతో వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకు సన్నిహితంగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఇలా చేయటమా? అంటూ నోరెళ్లబెడుతున్న పరిస్థితి. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే?

అనంతపురం పట్టణానికి అనుకొని ఉండే రుద్రంపేటపంచాయితీలో రమేశ్ అనే వ్యక్తికి1.27 ఎకరాల భూమి ఉండేది. దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారి నాయుడు, ఒక బ్యాంకు మాజీ ఉద్యోగి గౌరీ శంకర్ కు 2019లో అమ్మాడు. డీల్ లో భాగంగా అడ్వాన్సు రూపంలో కొంత ఇచ్చి అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

తర్వాత డబ్బులు ఇవ్వకపోవటంతో భూమిని అమ్మిన రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రమేశ్ సతీమణి నీరజ నాయుడు, గౌరీ శంకర్ లపై కంప్లైంట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇటీవల నకిలీ ఎన్వోసీ కేసులో పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారిపై ఉన్న పాత కేసులు ఏమిటన్న దానిపై తమదైన శైలిలో విచారణ చేస్తూ.. పాత రికార్డుల్నిబయటకు తీసినట్లుగా సమాచారం.

నిందితుల్లో ఒకరైన గౌరీశంకర్ కు రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావటంతో.. ఆయన్ను స్టేషన్ లో ఉంచారన్న సమాచారం తెలిసినంతనే పరుగు పరుగున స్టేషన్ కు వచ్చారని.. ఆ సందర్భంగా స్టేషన్ పరిసరాల్లోకి ఎవరినీ రానివ్వకపోవటం..

అనుచరులతో హడావుడి చేస్తున్న వైనాన్ని ఫోటోలు తీసిన వారిపై ప్రదర్శించిన జులుం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంత అధికారపక్షమైతే మాత్రం ఇంతనా? అని నోళ్లు నొక్కుకుంటున్న పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు అయితే ఆ మాత్రం ఉండదా? అంటున్న మాటలు వినిపించటమే కొసమెరుపు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.