Begin typing your search above and press return to search.

ఆ టీకా రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   11 Jun 2021 9:30 AM GMT
ఆ టీకా రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు .. ఎందుకంటే ?
X
కరోనా కట్టడికి వినియోగిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య అంతరాన్ని 84 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నవారినే వారినే వారి దేశాల్లోకి అనుమతిస్తామని పలు దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ క్రమంలోనే డోసుల మధ్య గడువును తగ్గించాలంటూ విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రోటో కాల్‌ లో కొత్త మార్పులు చేసింది కేంద్రం.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థానికంగా కోవిషీల్డ్ పేరుతో ఆక్స్‌ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ను తయారు చేస్తుంది. ప్రస్తుతం జాతీయ కరోనా వైరస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద అందించబడుతున్న రెండు వ్యాక్సిన్లలో ఇది ఒకటి కాగా, విదేశాలకు వెళ్లేవారు దీనినే వేయించుకోవలసి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో కోవిషీల్డ్ ఉంది. అయితే. సెకండ్ డోసు తక్కువ సమయంలోనే వేయించుకోవడానికి అనుమతి తప్పనిసరి. రెండు మోతాదుల మధ్య కనీస 28 రోజుల అంతరం ఉందని వారు నిర్ధారించుకోవాలి. ప్రయాణం నిజమేనా, అవసరం ఉందా, లేదా అనేదానిపై సర్టిఫికేట్ ఇవ్వాలి. విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశ ఆఫర్లు, జాబ్ ఆఫర్ లెటర్స్ లేదా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి నామినేషన్ పత్రాలకు సంబంధించిన పత్రాలు చూపించాలి.వ్యాక్సిన్ కోసం గుర్తింపు పత్రాలలో ఒకటిగా పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సూచించాయి. కోవిన్ యాప్‌లో ఇందుకు సంబంధించిని సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.