Begin typing your search above and press return to search.

మరోసారి వైరల్‌ అవుతున్న ఆ వైసీపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   15 Nov 2022 9:34 AM GMT
మరోసారి వైరల్‌ అవుతున్న ఆ వైసీపీ ఎమ్మెల్యే!
X
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన రూటే సెపరేటు అన్నట్టు సాగిపోతున్నారు. ఇప్పటివరకు ఆయన రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తొలిసారి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో ఆర్కే బయటపడ్డారు. 2019లో మాత్రం 5 వేలకు పైగా మెజారిటీ సాధించారు. అందులోనూ నాటి సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ను ఓడించి వైసీపీలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి మారారు.

కాగా ఎమ్మెల్యే ఆర్కే మొదటి నుంచి తన సింప్లిసిటీతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో ఆయనను కరకట్ట కమల్‌హాసన్‌ అని ప్రత్యర్థి పార్టీలు హేళన చేస్తున్నా ఆర్కే లక్ష్యపెట్టడం లేదు.

తాజాగా ఒక పెట్రోల్‌ బంకులో బైకుపైన వచ్చి పెట్రోలు కొట్టించుకుంటున్న ఆర్కే ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో తలకు హెల్మెట్‌ ధరించి వచ్చిన ఆర్కే వరుసలో ఉండి పెట్రోలు పోయించుకుంటున్నారు. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పుడే కాకుండా గతంలోనూ ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సింప్లిసిటీని చాటుకున్నారు. గతంలో తన పొలంలో లుంగీ కట్టుకుని, బనియన్‌తో పలుమార్లు కనిపించారు. అలాగే తన ఎద్దులతో పొలం దున్నుతూ, ట్రాక్టర్‌ నడుపుతూ కూడా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల చిత్రాలు గతంలో వైరల్‌ అయ్యాయి.

అంతేకాకుండా కేవలం రూ.5 కే తన నియోజకవర్గంలో టిఫిన్‌ అందించేలా ఆయన గత ప్రభుత్వ హయాంలో సొంతంగా క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. కూరగాయలు కూడా తక్కువ ధరలకే అందించే ఏర్పాటు చేశారు.

అధికారంలో ఉంటే అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కార్ల కాన్వాయ్‌.. హడావుడి, అనుచరులు, మందీమార్బలం ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే వీటన్నింటిని విడిచిపెట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలాంటి హడావుడి, ఆర్భాటాలు లేకుండా తన నిరాడంబరతను చాటడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.