Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డికి అందుకేనా.. పీసీసీ పీఠం దక్కనిది!

By:  Tupaki Desk   |   28 Jun 2021 9:30 AM GMT
కోమ‌టిరెడ్డికి అందుకేనా.. పీసీసీ పీఠం దక్కనిది!
X
తెలంగాణ పీసీసీ పీఠం అనూహ్యంగా.. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డి వ‌శం అయిపోయింది. అయితే.. పీసీసీ పీఠం ద‌క్కించుకు నేందుకు అనేక మంది రేసులో ఉన్నారు. సంస్థాగ‌తంగా కాంగ్రెస్‌లోనే ఉన్న‌వారు.. కాంగ్రెస్ పార్టీతోనే త‌మ భ‌విష్య‌త్తును ముడివేసుకున్న‌వారు కూడా ఈ రేసులో ఉన్నారు. ఇలాంటి వారిలో ఆది నుంచి ఫైర్ బ్రాండ్‌గా ఉన్న నాయ‌కుడు న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఒక‌రు. గ‌త కొన్నేళ్లుగా.. కోమ‌టిరెడ్డి.. పీసీసీ పీఠంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఆయ‌న అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశార‌ని ప్ర‌చారంలో ఉంది.

కేసీఆర్‌పై స‌రైన వాయిస్ వినిపించ‌డం లేదని.. ప్ర‌భుత్వానికి త‌గిన విధంగా కౌంట‌ర్లు ఇవ్వ‌డం లేదని.. ఆయ‌న వ‌ల్ల పార్టీ ప‌రువు పోతోంద‌ని.. త‌న‌కు పీసీసీ చీఫ్ ఇస్తే.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని.. ఇలా.. అనేక కోణాల్లో.. కోమ‌టిరెడ్డి కొన్నేళ్లుగా పీసీసీని ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపిక స‌మ‌యంలోనూ ఆయ‌న దూకుడుగానే ఉన్నారు. చివ‌రి నిముషం వ‌ర‌కు ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్‌కు జైకొట్టింది. దీంతో కోమ‌టిరెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

అయితే.. కోమ‌టిరెడ్డికి పీసీసీ పీఠం ఎందుకు ద‌క్క‌లేదు? అధిష్టానం ఆయ‌న పేరును ప‌రిశీల‌న‌కు తీసుకుని కూడా చివ‌రి నిము షంలో ఎందుకు ప‌క్క‌న పెట్టింది? అనే ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో ఉన్నారు. ఇది కాంగ్రెస్ అధిష్టానానికి న‌చ్చ‌లేదు. దీంతో మీరెలా నెట్టుకొస్తారు? మీ బ్ర‌ద‌ర్ బీజేపీలో ఉన్నారు కదా? అని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. దీనికి వెంక‌ట‌రెడ్డి.. స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేక పోయార‌ని స‌మాచారం. అదేస‌మ‌యంలో యువ‌త‌ను ఎలా స‌మీక‌రిస్తారు? అనే ప్ర‌శ్న‌కు కూడా ఆయ‌న నుంచి సంతృప్తిక‌ర స‌మాధానం రాలేదు.

అంతేకాదు.. కోమ‌టిరెడ్డి కుటుంబానికి.. ఏపీ అధికార పార్టీ వైసీపీతో సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో ఈ విష‌యాల‌ను కూడా కాంగ్రెస్ అధిష్టానం నిల‌దీసిన‌ట్టు స‌మాచారం. దీనిపై కూడా కోమ‌టిరెడ్డి నీళ్లు న‌మిలార‌ని.. ఈ క్ర‌మంలో యువ నాయ‌కుడు, యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత‌.. రేవంత్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో కేసీఆర్ టార్గెట్‌గా రాజ‌కీయం చేయ‌డంలోను.. ఫైర్ బ్రాండ్‌గా దూసుకుపోవ‌డంలోనూ రేవంత్‌కు మంచి మార్కులు ప‌డ్డాయ‌ని స‌మాచారం. సో.. ఇలా అత్యంత కీల‌క‌మైన మూడు విష‌యాల్లో కోమ‌టిరెడ్డి అధిష్టానం వ‌ద్ద విఫ‌లం కావ‌డం వ‌ల్లే పీసీసీ పీఠం జారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.