Begin typing your search above and press return to search.

అదీ రషీద్ రేంజ్.. అందుకే సన్ రైజర్స్ కు దూరం

By:  Tupaki Desk   |   13 April 2022 11:30 AM GMT
అదీ రషీద్ రేంజ్.. అందుకే సన్ రైజర్స్ కు దూరం
X
ఐదేళ్ల క్రితం అతడెవరో ఎవరికీ తెలియదు.. అసలు అఫ్ఘానిస్థాన్ లో అంతటి ప్రతిభ గల క్రికెటర్ ఉంటాడని కూడా ఊహించరు.. ఒక సీజన్ తోనే అతడి బౌలింగ్ కిటుకును పసిగట్టేస్తారనుకున్నారు.. అంతర్జాతీయ క్రికెట్ లో నిలవలేడని భావించారు.. కానీ.. ఇన్నేళ్లలో అతడిని గట్టిగా ఎదుర్కొన్నది ఒకరో ఇద్దరో...? అతడే మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. సునీల్ నరైన్ , వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్ వీరందరినీ కలిపినా రషీద్ ముందు దిగదుడుపే అనడంలో సందేహం లేదు.

'హైదరాబాద్' ఆణిముత్యమే
రషీద్ ను గుర్తించింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే. 2017లో అతడిని తొలిసారిగా లీగ్ బరిలో దించింది. అప్పటికి అతడికి వయసు 17 ఏళ్లు మాత్రమే. ఐదు సీజన్ల పాటు హైదరాబాద్ కు అద్భుత సేవలందించాడు రషీద్ . అతడి స్పిన్ తో పాటు భువనేశ్వర్, సందీప్ శర్మ తదితరుల పేస్ తోడవడంతో సన్ రైజర్స్ గత నాలుగైదు సీజన్లు మంచిగానే రాణించింది. అటు రషీద్ అంతర్జాతీయ క్రికెట్ లో అఫ్గాన్ క్రికెట్ జట్టు సారథిగా ఎదిగాడు. అయితే, అతడిని ఈసారి అనూహ్యంగా హైదరాబాద్ యాజమాన్యం అట్టిపెట్టుకోలేకపోయింది. దీనికి కారణం ఏమంటే.. రషీద్ రేంజ్ తమ స్థాయిలో లేదని చెప్పాడు బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీథరన్‌. 2017 నుంచి 2021 ఐపీఎల్‌ సీజన్‌ వరకు ఎస్‌ఆర్‌హెచ్‌లో భాగమైన రషీద్‌ ను రిటెన్షన్‌లో భాగంగా అట్టిపెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశామని, అయితే అతని రేంజ్‌లో తాము లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందని అన్నాడు.

ప్రస్తుతం రషీద్ గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను వీడిన అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం భావిస్తుందని సోషల్‌మీడియాలో వార్తల వస్తున్నాయి. వీటిపై మురళీథరన్‌ స్పందించాడు. రషీద్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ కుటుంబంలో మాజీ సభ్యుడు. అతడిపై ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యానికి కానీ అభిమానులకు కానీ ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవు. రిటెన్షన్‌లో రషీద్‌ను దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాము.. అయితే అతను అడిగినంత మేం ఇవ్వలేకపోయామంటూ మురళీథరన్‌ వివరణ ఇచ్చాడు.

అక్కడ రూ.1.70 కోట్లు.. ఇక్కడ రూ.15 కోట్లా?
అంతగా పేరులేని పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీపీఎల్‌)లో రషీద్ తీసుకునేది రూ.కోటి 70 లక్షలు. కానీ, ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్‌లో ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్ కోచ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్‌ అధిక రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిన వార్త నిజమేనని స్పష్టమవుతుంది. అయితే, పీపీఎల్ స్థాయి, ఐపీఎల్ స్థాయి వేరన్నది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. కాగా, రషీద్‌ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు వెచ్చించి డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేయగా, ఎస్‌ఆర్‌హెచ్‌.. కేన్ విలియమ్సన్‌ను రూ.12 కోట్లకు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లకు చెరి 4 కోట్లు ఇచ్చి రిటైన్‌ చేసుకుంది.

అప్పుడు రూ.4 కోట్లు.. అయిదేళ్ల లో ఎంత మార్పు?
రషీద్ ఐపీఎల్ అరంగేట్రం 2017లో రూ.4 కోట్లకు అతడిని సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ తరఫున 76 మ్యాచ్‌లు ఆడిన అతడు 6.35 ఎకానమీతో 93 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంచైజీ తరఫున రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అయితే, ఐదేళ్లలో రషీద్ చూపిన ప్రతిభకు రూ.15 కోట్ల ధర మాత్రమే ఉండడం తక్కువనే చెప్పాలి. వాస్తవానికి రషీద్.. ఆస్టేలియా కెప్టెన్ కమ్మిన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ జడేజా కు ఏమాత్రం తీసిపోడు. జైదేవ్ ఉనద్కట్ వంటి పేసర్ కు నాలుగేళ్ల కిందటే రూ.15 కోట్లుపైగా చెల్లించిన చరిత్ర ఉంది. అలాంటిది రషీద్ కు ఇంకా రూ.15 కోట్లే ఉండడం తక్కువనే చెప్పాలి.

నా బౌలింగ్‌లో ఎవరూ రిస్క్‌ చేయట్లేదు: రషీద్‌
గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎక్కువగా వికెట్లు తీయకపోయినా పరుగులను నియంత్రించడంలో రషీద్ విజయవంతమయ్యాడు. దీని వెనుక కారణం ఏంటో రషీద్‌ వెల్లడించాడు. "బ్యాటర్లు నా బౌలింగ్‌లో హిట్టింగే చేసేందుకు మొగ్గు చూపడం లేదు. అందుకే ఎక్కువగా వికెట్ల దొరకడం లేదేమో అనిపిస్తుంటుంది. అయితే ఇప్పటివరకు బౌలింగ్‌ పరంగా సంతృప్తిగానే ఉన్నా. నేను ఫలితం పట్టించుకోను. కేవలం బౌలింగ్‌ ఎలా వేస్తున్నానో అనేదానిపైనే దృష్టిసారిస్తా. అందుకే గొప్పగా వేయగలుగుతున్నా. ప్రత్యర్థి బ్యాటర్లు రిస్క్‌ తీసుకుని భారీ షాట్లు కొట్టకుండా ఉంటున్నారు. వారిని అలా అనుమతిస్తే మాత్రం ఎక్కువ వికెట్లు దక్కుతాయి" అని చెప్పుకొచ్చాడు.

నేను ఎప్పుడూ నెమ్మదిగానే ఆరంభిస్తా
మరో వికెట్‌ తీస్తే టీ20 లీగ్‌లో రషీద్‌ ఖాన్‌ ఖాతాలో వందో వికెట్ పడుతుంది. నిన్న హైదరాబాద్‌ మీద కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే (1/28) తీశాడు. మరో వికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. దీనిపై రషీద్‌ స్పందిస్తూ.. " ఒకసారి టీ20 లీగ్‌ గణాంకాలు చూస్తే.. నేనెప్పుడూ స్లో స్టార్టర్‌నే. నెమ్మదిగా ఆరంభించి పుంజుకోవడం నా ప్రత్యేకత. తొలి నాలుగైదు మ్యాచుల్లో 5-6 వికెట్లను మాత్రమే తీస్తుంటా. ఆ తర్వాత స్పీడ్‌ను అందుకుని వికెట్లను పడగొడతా. తప్పకుండా ఆ మ్యాజిక్‌ స్పెల్స్‌ పడే సమయం వస్తుంది" అని రషీద్ వివరించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కనీసం ఇంకో 15-20 పరుగులు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిలోనూ హైదరాబాద్‌ బ్యాటర్లు అద్భుతంగా ఛేజింగ్‌ చేశారని ప్రశంసించాడు.