Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి చేత సారీ చెప్పించిన అధికారపక్షం

By:  Tupaki Desk   |   28 Nov 2015 4:46 AM GMT
కేంద్రమంత్రి చేత సారీ చెప్పించిన అధికారపక్షం
X
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పై ప్రత్యేక చర్చ చేపట్టిన సందర్భంగా కేంద్రమంత్రి దావర్ చంద్ గెహ్లాట్ చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. ఆయన తన ప్రసంగంలో మాజీ ప్రధానులు ఇందిర.. రాజీవ్ గాంధీలు హత్యకు గురి కావటానికి వారు అనుసరించిన విధానాలే కారణమని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు లోక్ సభలో పెద్ద దుమారాన్నే రేపాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇలాంటి వ్యాఖ్యల కారణంగా వచ్చే నష్టాన్ని గుర్తించిన అధికారపక్షం అలెర్ట్ అయ్యింది. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేయగా.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు తగ్గట్లే అధికార బీజేపీ ప్రముఖులు స్పందించటం గమనార్హం. కేంద్రమంత్రి గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు సరి కావంటూ స్పీకర్ సుమిత్ర మహాజన్ తో పాటు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాలంటూ సూచన చేశారు. మరోవైపు ఇదే అంశంపై క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేత జోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. మొత్తంగా అధికార.. విపక్షాలతో పాటు.. స్పీకర్ గొంతు కలవటంతో కేంద్రమంత్రి దావర్ చంద్ గెహ్లాట్ తాను చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పక తప్పింది కాదు.