Begin typing your search above and press return to search.

ప్రైవేటుపరం కానున్న 13 ఎయిర్ పోర్టులు

By:  Tupaki Desk   |   26 Oct 2021 12:48 PM GMT
ప్రైవేటుపరం కానున్న 13 ఎయిర్ పోర్టులు
X
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం చాలా వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే మార్చిలోగా 13 విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఇపుడు పూర్తిగా కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్న విమానాశ్రయాలను తొందరలో ప్రైవేటీకరించటం ద్వారా పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ మోడ్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం గట్టిగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

దాదాపు 65 వివిధ ప్రభుత్వం సంస్ధలు, ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేయటం ద్వారా రు. 6 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే స్టీల్ ఫ్యాక్టరీలు, ఎయిర్ పోర్టులు, పోర్టులు, రైల్వేస్టేషన్లు తదితరాల ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఒకవైపు స్టీల్ ఫ్యాక్టరీల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తునే మరోవైపు ఎయిర్ పోర్టుల విషయంలో కూడా జోరు పెంచింది.

అమ్మేయబోతున్న 13 విమానాశ్రయాల్లో 6 పెద్దవి 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల్లో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్ పూర్, తిరుచ్చి, వారణాశి ఉన్నాయి. చిన్న విమానాశ్రయాల్లో తిరుపతి, ఔరంగాబాద్, జబల్ పూర్, కంగ్రా, ఖుషీనగర్, గయ ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాలను, చిన్న విమానాశ్రయాలతో కలిపి వేలం వేయాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ చేసింది. వారణాశి విమానాశ్రయంలో ఖుషీనగర్, గయను కలిపేస్తున్నారు.

అలాగే అమృత్ నగర్ లో కంగ్రాను, భువనేశ్వర్ విమానాశ్రయంతో తిరుపతిని, రాయపూర్-ఔరంగాబాద్, ఇండోర్-జబల్ పూర్, తిరుచ్చి-హుబ్లీ విమానాశ్రలను కలిపి అమ్మేస్తున్నారు. పర్ ప్యాసెంజర్ రెవిన్యు మోడ్ పద్దతిలో విమానాశ్రయాలకు బిడ్డింగ్ ను ఆహ్వానించబోతున్నట్లు ఇప్పటికే కేంద్ర పౌర విమనాశ్రయ శాఖ ప్రకటించింది. ఇప్పుడు చేస్తున్న ప్రైవేటు ప్రక్రియ 50 ఏళ్ళపాటు అమల్లో ఉంటుంది.

నష్టాల్లో ఉన్న ఎయిర్ పోర్టు అథారిటి ఆఫ్ ఇండియా బయటపడేందుకే విమానాశ్రయాలను అమ్మేస్తోంది. ఒకటి విమానాశ్రయాల నిర్వహణ, సిబ్బంది జీతాలు, బత్యాలు తదితరాల ఖర్చును తగ్గిపోతుంది. ఇదే సమయంలో 13 ఎయిర్ పోర్టులను అమ్మేయటం వల్ల శాఖకు డబ్బు కూడా అందుతుంది. ఇప్పటికే అథారిటి 1962 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. దీనికోసం బ్యాంకు నుండి రు. 1500 కోట్లు అప్పుకూడా తీసుకుంది. భవిష్యత్తులు మరింత అప్పు చేస్తే కానీ ఎయిర్ పోర్టుల నిర్వహణ సాధ్యంకాదని తేలిపోయింది. అందుకనే ముందుగా 13 విమానాశ్రయాలను అమ్మేస్తోంది.