Begin typing your search above and press return to search.

ఇటీవల వర్షాలతో 44 ఏళ్ల రికార్డు తుడుచుపెట్టుకుపోయింది

By:  Tupaki Desk   |   30 Aug 2020 4:50 AM GMT
ఇటీవల వర్షాలతో 44 ఏళ్ల రికార్డు తుడుచుపెట్టుకుపోయింది
X
మండే ఎండలు మేతో ముగిసిన తర్వాత వచ్చే జూన్ లో కురిసే వానల మీద చాలామంది ఆశలు పెట్టుకుంటారు. వర్షాలతో వాతావరణం చల్లబడుతుందని.. అప్పటివరకు ఉక్కిరిబిక్కిరి అయిన వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా చూస్తే.. జూన్ లో పెద్దగా వానలు పడని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈసారి ఆగస్టులో కురిసిన వర్షాలు అదరగొట్టేశాయని చెబుతున్నారు.

సరాసరి ఆగస్టులో కురిసే వర్షాలతో పోలిస్తే.. ఈసారి భారీగా కురిసినట్లుగా చెబుతున్నారు. సాధారణ సగటుకు మించి పాతిక శాతం అధిక వర్షపాతం నమోదైన విషయాన్ని ఐఎండీ వెల్లడించింది. నలభైనాలుగేళ్లలో ఈసారే అత్యధిక వర్షపాతంగా పేర్కొన్నారు.

ఈ నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జన జీవనం స్తంభించిపోవటమే కాదు.. పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆగస్టు నెలలో ఇంతలా వర్షాలు కురవటం దాదాపుగా 44 ఏళ్ల క్రితం ఒకసారి మాత్రమే చోటు చేసుకున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. 1976 తర్వాత ఇంతలా వర్షాలు కురవటం.. అది కూడా ఆగస్టులో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అప్పట్లో సాధారణం కంటే 28.4 శాతం అధికంగా వర్షాలు కురిసినట్లుగా అధికారులు చెబుతున్నారు.

తాజాగా కురిసిన వర్షాల కారణంగా బిహార్.. ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. గుజరాత్.. గోవా లాంటి రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ లాంటి పట్టణం ఎలా మారిందో చూసిందే. ఇక.. భారీ వర్షాలతో రిజర్వాయర్లు నిండుకుండలో మారాయి. మొత్తానికి నాలుగు దశాబ్దాలకు పైనే ఉన్న రికార్డు తుడుచుపెట్టుకుపోయినట్లుగా చెప్పాలి.