Begin typing your search above and press return to search.

మోస‌గాడి పాత్ర‌లో జీవించిన న‌టుడు.. రూ.20 కోట్లు కొట్టేశాడు!

By:  Tupaki Desk   |   19 March 2021 8:59 AM GMT
మోస‌గాడి పాత్ర‌లో జీవించిన న‌టుడు.. రూ.20 కోట్లు కొట్టేశాడు!
X
‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ అని ఆ మ‌ధ్య ఓ సినిమా వ‌చ్చింది. అందులో ‘రైస్ పుల్లింగ్’ ఎపిసోడ్ ఉంటుంది. ఆ రైస్ పుల్లింగ్ కలశం మీ ఇంట్లో ఉంటే.. బిల్ గేట్స్ ఫాదర్ అయిపోతావంటూ న‌మ్మిస్తారు. నిజ‌మేన‌ని న‌మ్మిన ఓ బ‌క‌రా.. వాళ్లు అడిగినంత డ‌బ్బు ముట్ట‌చెపుతాడు. అది అందుకొని గ్యాంగ్ ప‌రార్‌!

ఇప్పుడు రియ‌ల్ లైఫ్ లో సీన్ ఓపెన్ చేస్తే.. సేమ్ కంటెంట్. అదే ‘రైస్ పుల్లింగ్‌’తో ఓ కొండగొర్రెను కోసి కూర వండుకొని తినేసినంత పనిచేసింది ఓ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడర్ ఎవరో కాదు.. ఒక సినిమా నటుడు! సీనియ‌ర్ న‌టి కుమారుడు! డ‌బ్బు మీద ఆశ మ‌హా చెడ్డది క‌దండీ.. అది ఏప‌నైనా చేయిస్తుంది క‌దండీ.. ఇత‌గాడు ఈ మార్గం ఎంచుకున్నాడు.

క‌ట్ చేస్తే.. చెన్నైలోని వ‌ల‌స‌ర‌వాక్కం ప్రాంతం. అక్క‌డ నెరుమార‌న్ అనే వ్య‌క్తి నివ‌సిస్తున్నాడు. ఆర్థికంగా గ‌ట్టిపిండ‌మే. కానీ.. ముందే చెప్పుకున్నాం క‌దా.. డ‌బ్బు మీద ఆశ మ‌మాచెడ్డ‌ద‌ని, అది ఇత‌నికి కూడా బ‌హు మెండు. ఎలా ప‌ట్టారో ఇత‌డి జాడ తెలియ‌దుగానీ.. మొత్తానికి ఆ యాక్టర్‌ క‌మ్ సీనియ‌ర్ యాక్ట్రెస్ స‌న్ ఓ గ్యాంగును వెంటేసుకొని నెరుమార‌న్ ముందు వాలిపోయారు.

ట‌ట్ట‌డాయ్‌.. అంటూ సంచిలోంచి ఓ చెంబు తీసి చూపించారు. ఇది అలాంటిలాంటిది చెంబు కాదు.. క‌లశం అన్నారు. అది కూడా మామూలు క‌ల‌శం కాదు.. రైస్ పుల్లింగ్ క‌ల‌శం అని చెప్పారు. నోరు, క‌ళ్లు పెద్ద‌వి చేసి వింటున్న నెరుమార‌న్ చెవిలో పెద్ద కాలీ ఫ్ల‌వ‌ర్ పెట్టేశారు. ఇది మీ ఇంట్లో ఉంటే సామిరంగా.. నువ్వు అంబానీకి త‌మ్ముడివి.. బిల్ గేట్స్ కు బాబాయివి అయిపోతావ‌న్నారు. వెంట‌నే డ్రీమ్ సీన్ వేసుకున్న నెరుమార‌న్‌.. ఆ వెంట‌నే త‌న‌కు ఇచ్చేయ‌మ‌న్నాడు. కొంత ఖ‌ర్చ‌వుద్ద‌న్నారు వీళ్లు. అలా మొద‌లైంది డీల్‌..

బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమాలోని రైస్ పుల్లింగ్ క‌థ రెండున్న‌ర గంట‌ల్లో ముగిసింది కానీ.. వీళ్ల సినిమా మాత్రం సంవ‌త్స‌రాలుగా సాగుతూనే ఉంది. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ర‌న్ అయ్యిన నెరుమార‌న్ రైస్ పుల్లింగ్ బ‌డ్జెట్ మొత్తం దాటిపోయింది. బ్యాంకు ఖాతాను ఊడ్చేశాడు.. అప్పులు తేవ‌డం మొద‌లు పెట్టాడు. డ‌బ్బులు ఒడుస్తున్నాయిగానీ.. రైస్ పుల్లింగ్ మాత్రం నిండ‌ట్లేదు. ఏంటీ క‌థ అని అడిగితే.. స‌ద‌రు న‌టుడు జ‌స్ట్ వెయిట్ అంటున్నాడంతే!

ఇంకా ఎంత కాలం ఈ వెయింటింగ్ అని వెన‌క్కి తిరిగి చూస్తే.. ఒక‌టీ రెండు కాదు.. 8 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి! డ‌బ్బెంత ఖ‌ర్చ‌యింతందని లెక్క‌లు వేస్తే రూ.26 కోట్లు తేలింది! ఇన్ని డ‌బ్బులు పోయాక‌, ఇన్ని సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాక.. ఇదేదో య‌వ్వారంలా ఉంద‌ని అనిపించింది న‌రుమార‌న్ కు. గుండెలు బాదుకుంటూ పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లిపోయా‌డు.

ఆరాతీస్తే.. మోసం చేసింది ఓ న‌టుడ‌ని - అత‌గాడు త‌మిళ్ సీనియ‌ర్ న‌టి జ‌య‌చిత్ర కుమారుడు అని తేలింది. అత‌నితోపాటు అత‌గాడి గ్యాంగ్ ను కూడా బొక్క‌లోకి నెట్టింది. కష్టపడకుండా పోగేద్దామనుకుంటే.. ఫలితం ఇలాగే ఉంటది మరి!