Begin typing your search above and press return to search.

సొంత పార్టీ మీద బాంబేసిన సీనియర్

By:  Tupaki Desk   |   16 Nov 2020 1:50 PM GMT
సొంత పార్టీ మీద బాంబేసిన సీనియర్
X
దేశంలోని మరే పార్టీలో లేని రీతిలో అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన సీనియర్లు అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసేందుకు వెనుకాడరు. ఆ సందర్భంలో పార్టీ ప్రతిష్టకు భారీ డ్యామేజ్ జరిగినప్పటికి పట్టించుకోరు. పార్టీ సంగతి పక్కన పెట్టేసి.. నిర్మోహమాటంగా మాట్లాడే సీనియర్ నేతల పుణ్యమా అని.. పార్టీ పరువు బజారున పడుతుంటుంది.

తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్ చేసిన ఆరోపణ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేదిగా చెప్పక తప్పదు. బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయమే.. మహా ఘట్ బంధన్ పవర్లోకి రాకపోవటానికి కారణమన్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున సీట్లు తీసుకొని.. తక్కువ స్థానాల్లో గెలవటంతో ఎన్డీయే సర్కారు మరోసారి కొలువు తీరే అవకాశం కలిగింది.

ఇలాంటివేళ.. పార్టీ వైఫల్యాలపై గుండెల్లో గూడుకట్టుకున్న భావాల్ని బయటపెట్టేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇక ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా భావించటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల్ని ఆయన చెప్పేస్తూ.. పార్టీలో జరగాల్సిన ప్రక్షాళన అవసరాన్ని వెల్లడించారు. బిహార్ ప్రజలు ఆర్జేడీని ప్రత్యామ్నాయంగా భావించారని.. అదే సమయంలో గుజరాత్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన వైనాన్ని ప్రస్తావించారు.

యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి రెండు శాతం కంటే తక్కువ ఓట్లు పడినట్లుగా పేర్కొన్నారు. ఆరేళ్లుగా ఆత్మవిమర్శ చేసుకోని కాంగ్రెస్ పార్టీ.. ఇకపై చేసుకుంటుందని ఆశించగలమా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోని సమస్యలు తెలుసని.. వాటి పరిష్కారాల్ని గుర్తించటానికి ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. పార్టీలోని సమస్యల్ని అధికారికంగా గుర్తించటానికి ఇష్టపడటం లేదన్న ఆయన.. ఇదే తీరుకొనసాగితే.. పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్నారు.

తాను కాంగ్రెస్ వ్యక్తినని.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని చెప్పిన ఆయన.. దేశాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వానికి అసలైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేవారు. ఇన్ని ఫిర్యాదులు చేసిన కపిల్ సిబల్.. పార్టీని ప్రక్షాళన చేయటానికి.. ప్రజలకు దగ్గర కావటానికి ఏమేం చేయాలో చెప్పుకొచ్చారు.

అనుభవం ఉన్న నేతలు.. సమకాలీన రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకునే వ్యక్తులు.. మీడియాలో పార్టీని చూపించాల్సిన విధానం గురించి అనుభవం.. అవగాహన ఉన్న నేతలతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సిబల్ మాటలన్ని వింటే.. రాహుల్ బాబు.. పార్టీ బాగుపడాలంటే నువ్వు పక్కన పెట్టిన సీనియర్ నేతల్ని కలుపుకో.. వారికి ప్రాధాన్యత ఇవ్వు. అప్పుడు మాత్రమే పార్టీ బాగుపడుతుందన్న సందేశాన్ని తన మాటల్లో చెప్పినట్లుగా కనిపించట్లేదు? సలహా.. సూచన పేరుతో పార్టీ బలహీనతను బజారున పడేలా చేస్తున్న సిబల్ తీరుతో లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.