Begin typing your search above and press return to search.

ఆసుపత్రి ఆరాచకం.. బిల్లు కట్టకుంటే బిడ్డను ఇచ్చేయాలట

By:  Tupaki Desk   |   9 Sep 2020 10:10 AM GMT
ఆసుపత్రి ఆరాచకం.. బిల్లు కట్టకుంటే బిడ్డను ఇచ్చేయాలట
X
కార్పొరేట్.. ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకం ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చెప్పే ఉదంతం ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. కోపం తన్నుకు రావటం ఖాయం. నిరుపేదల విషయంలో ఆసుపత్రులు వ్యవహరించే తీరు ఇంత దారుణంగా ఉంటుందా? అన్న సందేహం కలిగేలా ఉందీ ఉదంతం.

36 ఏళ్ల నిరుపేద బబిత గర్భవతి అయ్యింది. ఆమె భర్త శివచరణ్ రిక్షా తొక్కుతుంటాడు. నొప్పులు రావటంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు సిజేరియన్ చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందంలో ఉన్న బబితకు ఆసుపత్రి వారు చేతిలో పెట్టిన బిల్లు షాకింగ్ గా మారింది.

ఎందుకంటే అన్ని ఖర్చులు కలిపి రూ.35వేల బిల్లు వేసింది ఆసుపత్రి. అంతమొత్తం తాను చెల్లించే స్తోమత లేదని.. తాను పొదుపు చేసిన మొత్తాన్ని ఇస్తానని వేడుకున్నాడు. తమ ఆర్థిక పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకు ససేమిరా అన్న ఆసుపత్రి యాజమాన్యం.. ఊహించిన ప్రపోజల్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

మీరు ఆసుపత్రి బిల్లు కట్టటం కుదరకుంటే.. బిడ్డను అమ్మేయండి.. ఆ వచ్చిన డబ్బులు మాకివ్వండంటూ సూచన చేశారు. అక్కడితో ఆగని వారు.. బిడ్డను మాకు ఇచ్చేయండి లక్ష రూపాయిలు ఇస్తామని.. ఆసుపత్రికి పైసా కట్టాల్సిన అవసరం లేదని తేల్చారు. దీంతో.. బిత్తరపోయిన బబిత దంపతులు వేదన చెందుతూ తమకు ఎదురైన చేదు అనుభవాన్ని స్థానిక మీడియాకు చెప్పారు.

పేదరికంతో ఆసుపత్రి బిల్లు కట్టలేక.. వారు చెప్పినట్లే బిడ్డను వదులుకున్న దైన్యం కథనాల రూపంలో మీడియాలో రావటం సంచలనంగా మారింది. లక్షరూపాయిలు చేతిలో పెట్టి వారం రోజుల తమ బిడ్డను ఆసుపత్రి వారు తీసేసుకున్నట్లుగా బబిత కన్నీళ్లు పెట్టుకుంటూ వెల్లడించింది. ఈ ఉదంతం మీడియాలో పెద్ద ఎత్తున రావటంతో జిల్లా న్యాయమూర్తి వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన సదరు న్యాయమూర్తి.. ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించటమే కాదు.. దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఆసుపత్రి వాదన మరోలా ఉంది. బబిత దంపతులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. బిడ్డను వదులుకోవాలని తాము బలవంతం చేయలేదని చెప్పుకొచ్చారు. వారే స్వయంగా బిడ్డను దత్తత ఇచ్చారని.. అధికారికంగా అన్ని పత్రాల్ని పూర్తి చేశారని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు చెబుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారటంతో పాటు.. బాలల హక్కుల సంఘాలు రంగంలోకి దిగి ఆసుపత్రి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నాయి.