Begin typing your search above and press return to search.

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేం : హైకోర్టు లో జగన్ సర్కార్

By:  Tupaki Desk   |   15 Dec 2020 12:09 PM GMT
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేం : హైకోర్టు లో జగన్ సర్కార్
X
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టుబడుతుంటే , ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో కుదరదు అంటూ చెప్తుంది. తాజాగా ఈ విషయం పై హైకోర్టు లో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, కరోనా వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది.

మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించిందని హైకోర్టు కి తెలిపింది. ఎన్నికల ప్రక్రియ లాగానే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్లో తెలిపింది. ఈ కారణంగానే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ ఈ సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వచ్చే శుక్రవానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఓ వైపు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం చెపుతుంటే... ఎన్నికలను నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో.