Begin typing your search above and press return to search.

ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేయొద్దు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   29 Nov 2021 2:30 PM GMT
ఏ బ్యాంకులోనూ డిపాజిట్ చేయొద్దు.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం
X
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం.. తాజాగా అన్ని విభాగాలకు.. సంస్థలకు తాజాగా ఒక లేఖ రాసింది. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వ సంస్థలు.. శాఖలు.. విభాగాల వారు తమ వద్ద ఉన్న ప్రజా ధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి వీల్లేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల ఆధారంగా చూస్తే.. కంపెనీ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్ లోనే ఆ మొత్తాల్ని డిపాజిట్ చేయాలని డిసైడ్ చేశారు.

దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని సీఎస్ సమీర్ శర్మ జారీ చేశారు. ఉన్నట్లుండి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం.. ‘‘నిధుల సంరక్షణ’’గా చెబుతున్నారు. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం చూస్తే.. ప్రభుత్వ కార్పొరేషన్లు.. సొసైటీలు.. బోర్డులు.. ట్రస్టులు.. సంస్థలు... వర్సిటీలు.. ప్రత్యేక ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన సంస్థలన్ని తమ వద్ద ఉన్న మిగులు నిధులు.. ఇతరత్రా వసూలు చేసిన నిధుల్ని ఒక్కచోటే డిపాజిట్ చేయాలని పేర్కొంది.

అయితే.. ఈ సంస్థలకు మినహాయింపుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. ఇతర దేవాలయ సంస్థలు ఉన్నాయి. తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల్ని ఒకేచోట డిపాజిట్ చేయటం ద్వారా.. దారి మళ్లకుండా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు.. ఇలా డిపాజిట్ చేయటం ద్వారా.. ప్రభుత్వం తన ప్రాధామ్యాలకు అనుగుణంగా ఖర్చు చేసేందుకు వీలుందని అంటున్నారు. ఏమైనా.. ఇప్పటివరకు సాగినట్లుగా డిపాజిట్లను వేర్వేరుగా డిపాజిట్ చేయకుండా ఒకే చోట మహా డిపాజిట్ చేయమని కోరటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.