Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ కు ఊరట...ఆ పిటిషన్ల కొట్టివేత

By:  Tupaki Desk   |   2 Nov 2020 2:10 PM GMT
జగన్ సర్కార్ కు ఊరట...ఆ పిటిషన్ల కొట్టివేత
X
కొంతకాలంగా ఏపీ సర్కార్ కు హైకోర్టులో వరుసగా చుక్కెదురవుతోన్న సంగతి తెలిసిందే. ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపు మొదలు....మూడు రాజధానుల అంశం, అమరావతి నుంచి రాజధాని తరలింపు వరకు పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సర్కార్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అమరావతి రాజధాని కేసుల విషయంలో తమను కూడా ఇంప్లీడ్ చేయాలన్న వారి పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు, విశాఖలోని కాపుల్పాడ కొండమీద ప్రభుత్వం నిర్మించదలచిన గెస్ట్ హౌస్ కి సంబంధించి ప్లాన్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

విశాఖలో భారీ గెస్ట్ హౌస్ నిర్మాణంపై గతంలో కేసులు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరుగుతున్న సమయంలోనే కాపులుప్పాడ కొండల మీద 30 ఎకరాల భూమిని గెస్ట్ హౌస్ కు ప్రభుత్వం కేటాయించింది. అది గెస్ట్ హౌస్ కాదని, సెక్రటేరియేట్ అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ గెస్ట్ హౌస్ నిర్మాణం పై పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ క్రమంలోని ఆ వ్యవహారానికి సంబంధించిన అనుబంధ పిటిషన్లను తోసిపుచ్చింది. ఆ గెస్ట్ హౌస్ ప్లాన్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిపాలన రాజధానిలో భాగంగా సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మిస్తే తమ దృష్టికి తీసుకురావచ్చని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టం చేసింది. సీఎం క్యాంప్ ఆఫీసు అక్కడే ఉంది కాబట్టి రాజధాని కూడా అక్కడే ఉండాల్సిందే అనే పిటిషన్ లో అర్థం లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో, జగన్ సర్కారుకు కోర్టులో ఊరట లభించినట్లయింది.