Begin typing your search above and press return to search.

ఆసీస్ దిగ్గజం మళ్లీ మైక్ పట్టాడు.. అంతా క్షేమమే..!

By:  Tupaki Desk   |   3 Dec 2022 5:27 AM GMT
ఆసీస్ దిగ్గజం మళ్లీ మైక్ పట్టాడు.. అంతా క్షేమమే..!
X
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.. దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ రిటైర్మెంట్ తర్వాత కోచ్ గా.. కామెంటేటర్ గా మారిపోయాడు. కొన్నేళ్లుగా కోచ్ పాత్రలోనూ.. కామెంటేటర్ గానూ అభిమానులను తనదైన శైలిలో పాంటింగ్ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య ద్వైపాక్షిక సిరీసులోనూ కామెంటేటర్ గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నారు.

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైన నేపథ్యంలో రికీ పాంటింగ్ కామెంటేటర్ గా కనిపించాడు. మ్యాచ్ మూడో రోజు లంచ్ సమయంలో రికీ పాంటింగ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. కామెంట్రీ బాక్స్ నుంచి ఉన్నఫళంగా వెళ్లిపోవడంతో అతడికి గుండెపోటు వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో రికీ ఫ్యాన్స్ కలవరపాటుకు గురయ్యారు.

అయితే నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు జరిగిన ప్రీ మ్యాచ్ షోలో రికీ పాంటింగ్ మళ్లీ కన్పించారు. దీంతో అభిమానులు సంతోషానికి గురయ్యారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై రికీ పాంటింగ్ స్పందించారు. శుక్రవారం నాడు తనకు ఒంట్లో నలతగా అనిపించడంతో ముందు జాగ్రత్తగా వెళ్లినట్లు తన సహచర కామెంటేటర్లకు పాంటింగ్ తెలిపాడు.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందొద్దని సూచించాడు. అలాగే కామెంట్రీ బాధ్యతల నుంచి తాను తప్పుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. ఈక్రమంలోనే రికీ పాంటింగ్ కామెంటరీ చెబుతున్న ఫోటోలు.. వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారిపోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రికీ పాంటింగ్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరానికి చెందిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ గానూ.. ఆస్ట్రేలియాకు ఉత్తమ బ్యాట్స్మెన్ గా రాణించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన రికార్డు నెలకొల్పాడు. రెండు వన్డే ప్రపంచ కప్ లను ఆస్ట్రేలియాకు అందించిన ఘనత సాధించాడు.

2012లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రికీ పాటింగ్ ఆ తర్వాత నుంచి కోచ్ గా.. కామెంటేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గానూ రికీ పాంటింగ్ వ్యవహరిస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏది ఏమైనా రికీ పాంటింగ్ ఆరోగ్యంగా తిరిగి రావడంతో అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.