Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకాను హత్య చేసిన గొడ్డలిని కొన్నది ఎక్కడ? ఎందుకలా?

By:  Tupaki Desk   |   14 Nov 2021 5:05 AM GMT
వైఎస్ వివేకాను హత్య చేసిన గొడ్డలిని కొన్నది ఎక్కడ? ఎందుకలా?
X
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు కమ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన వైనం తెలిసిందే. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించిన వారిలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి.. సీబీఐకి వాంగ్మూలాన్ని ఇచ్చాడు. వివేకాను ఎలా హత్య చేశారు? దాన్ని అమలు ఎలా చేశారు? హత్య చేసిన రోజున ఏం జరిగింది? హత్య చేసే వేళలో.. పాల్గొన్న వారెందరు? ఎవరెవరు ఏమేం చేశారు? లాంటి విషయాల్ని వివరంగా వెల్లడించాడు.

వైఎస్ వివేకాను హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని ఎక్కడ కొన్నది? ఎంతకు కొన్నది? లాంటి వివరాల్ని కూడా దస్తగిరి వెల్లడించాడు. అతడు చెప్పిన వివరాల్ని చూస్తే.. సునీల్ యాదవ్ ఫోన్ చేసి హత్యకు అవసరమైన గొడ్డలిని కొనాలని చెప్పాడు. దీంతో గొడ్డలి కొనేందుకు దస్తగిరి అనంతపురం జిల్లా కదిరికి వెళ్లాడు. తొలుత పులివెందులలో కొనాలని అనుకున్నా.. అలా చేస్తే గుర్తు పడతారన్న ఉద్దేశంతో అక్కడ కొనలేదు.

సొంత పని మీద కదిరికి వెళుతున్న హఫీజుల్లాతో కలిసి స్కూటీపై వెళ్లాడు దస్తగిరి. అక్కడి కేకేసీ హార్డ్ వేర్ షాపులో రూ.450 పెట్టి గొడ్డలి కొనుగోలు చేశాడు. మధ్యాహ్న వేళలో కదిరికి వెళ్లి.. రాత్రి తొమ్మిది గంటల వేళలో పులివెందులకు వచ్చేశాడు దస్తగిరి. అలా హత్యకు వినియోగించిన ప్రధాన ఆయుధమైన గొడ్డలిని పులివెందులలో కాకుండా కదిరిలో కొనుగోలు చేశారు. హత్య వేళలో గొడ్డలిని పలువురు వినియోగించారు. వివేకా కుడి చేతిని గాయపరిచేందుకు గొడ్డలిని దస్తగిరి వినియోగించాడు.

హత్య చేసే వేళలో దస్తగిరితో పాటు మరో నలుగురు కూడా పాల్గొన్నారు. గొడ్డలితో వైఎస్ వివేకా తల మీద పలుమార్లు కొట్టిన ఉమాశంకర్ రెడ్డి.. అనంతరం బాత్రూంలోనూ వివేకాను అదే ఆయుధంగా దాడి చేసి గాయపర్చటంలో ఈ గొడ్డలి కీలకంగా మారింది.