Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాజీ సీఎం కొడుకు?

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:10 AM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాజీ సీఎం కొడుకు?
X
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు హైదరాబాద్ కు కొత్తేం కాదు. కానీ.. తాజా ఉదంతం ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో సహా పలువురు మంత్రుల పుత్రరత్నాలతో ముడిపడిన ఈ వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దపెద్ద తలకాయల పిల్లలు సీన్లో ఉండటం.. పోలీసులు వచ్చేసరికి సీన్ మొత్తాన్ని మార్చేసినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాటిక్ గా సాగిన ఈ ఉదంతాన్ని చూస్తే..

జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు12కి చెందిన అనిల్ కుమార్ రెడ్డి వాకింగ్ లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 1లోని గేట్ నెంబరు 2 వద్ద రోడ్డు మీద తన బీఎండబ్ల్యూ కారును ఉంచేసి వాకింగ్ కు వెళ్లారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం.. అలా కారు వదిలేసి వెళ్లిన కాసేపటికి జూబ్లీహిల్స్ నుంచి ఫిలింనగర్ వైపు వేగంగా వెళుతున్న బెంజ్ కారు (టీఎస్ 09 ఏఆర్ టీ టీఆర్ 1051) కారువేగంగా వచ్చి బీఎండబ్ల్యూ కారు వెనుక భాగాన్ని గుద్దేసింది.

వేగంగా వచ్చి కారును గుద్దేసే సమయంలో కారులో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ప్రమాదం జరిగిన వెంటనే.. కారులోని బెలూన్లు విచ్చుకోవటంతో కారు నడుపుతున్న వారికి ఏమీ కాలేదు. యాక్సిడెంట్ ను గుర్తించిన కొందరు బెంజ్ కారు వద్దకు వెళ్లి డోర్లు తెరిచారు. గంజాయి పొగతో పాటు మద్యం బాటిళ్లతో కారు కనిపించటం.. అందులోని ముగ్గురు యువకులు మత్తులో ఉండటంతో వారిని దించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో వెనుక నుంచి మరో కారు వచ్చి.. కారులోని వారిని తీసుకెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. పూటుగా తాగేసి.. గంజాయి మత్తులో ఉన్న బెంజ్ కారులో ఉన్న ముగ్గురు కుర్రాళ్లు.. వీవీఐపీ కొడుకులుగా చెబుతున్నారు. కారులో ఉన్న వారిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి కుమారుడైతే.. మరొకరు మంత్రి కుమారుడని.. ఇంకొకరు తాజా మంత్రి కుమారుడిగా తెలుస్తోంది. ఇదంతా జరిగిన కాసేపటికి కారు యజమాని తన వాకింగ్ ముగించుకొని వచ్చేసరికి.. కారు ధ్వంసం కావటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దెబ్బ తిన్న కార్లను తరలించిన పోలీసుల వద్దకు.. తానే కారును గుద్దినట్లుగా ఒక వ్యక్తి వచ్చి పోలీసులకు లొంగిపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు కారు నడిపింది మంత్రి కుమారుడని.. మిగిలిన ఇద్దరిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాగా.. ఇంకొకరు మంత్రి కొడుకని.. పెద్ద తల కాయల పిల్లలు సీన్లో ఉండటంతో వారిని తప్పించి.. సంబంధం లేని వ్యక్తి ప్రమాదాన్ని తన మీద వేసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రమాదం చేసినట్లుగా చెప్పిన వ్యక్తి తాగకుండా ఉండటం గమనార్హం. కారులో మాత్రం ఒక మద్యం బాటిల్ దొరికినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరీ కారు యాక్సిడెంట్ ఇష్యూలో అసలు వ్యక్తుల్ని పోలీసులు తెరపైకి తీసుకొస్తారా? అన్నది ఇప్పుడుపెద్ద సందేహంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/