Begin typing your search above and press return to search.

అస‌లుసిస‌లు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ చూపించారు!

By:  Tupaki Desk   |   15 July 2019 11:02 AM IST
అస‌లుసిస‌లు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ చూపించారు!
X
ఎన్నాళ్ల‌కు ఎన్నాళ్ల‌కు.. ఎట్ట‌కేల‌కు క్రికెట్ పుట్టినిల్లు పుల‌క‌రించింది. తాము క‌నిపెట్టిన క్రికెట్ ఆట‌కు సంబంధించి అత్యుత్త‌మ టోర్నీగా చెప్పే ప్ర‌పంచ క‌ప్ ను సొంతం చేసుకోలేక‌పోయామ‌న్న దిగులు ఇంగ్లండ్ వాసుల‌కు తీరిపోయింది.

తాజాగా జ‌రిగిన ఫైన‌ల్ ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ అద్భుత‌మైన పోరాట‌ప‌టిమ చూపించి విజ‌యాన్ని సొంతం చేసుకోగా.. చివ‌రి బాల్ వ‌ర‌కు పోరాడిన కివీస్ జ‌ట్టు ఓడినా.. ప్ర‌పంచ క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని మాత్రం గెలుచుకుంద‌ని చెప్పాలి. అన్నింటికిమించిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ అంటే ఎలా ఉండాలో అర్థ‌మ‌య్యేలా చేశాయి ఇంగ్లండ్‌.. న్యూజిలాండ్ జ‌ట్లు. క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ అంటే ఇలా ఉండాల‌న్న రీతిలో సాగిన ఈ మ్యాచ్.. క్రికెట్ క్రీడాభిమానుల‌కు విందుభోజ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. న‌రాలు తెగిపోయేలా సాగిన ఫైన‌ల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజ‌యాన్ని సొంతం చేసుకొని స‌గ‌ర్వంగా క‌ప్పును సొంతం చేసుకున్నారు.

రెండు జ‌ట్లు చెరో 50 ఓవ‌ర్లు ఆడినా.. ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు.. ఊహించ‌ని రీతిలో 50 ఓవర్లో రెండు వ‌రుస బంతుల్లో 12 ప‌రుగులు సాధించ‌టంతో కివీస్ ఆట‌గాళ్ల ప్ర‌పంచ‌క‌ప్ క‌ల క‌ల‌గా మిగిలిపోయింది. ఫీల్డింగ్ మిస్టేక్ తో బంతి బౌండ‌రీ దాట‌టం మ్యాచ్ కోల్పోవ‌టానికి కార‌ణంగా చెప్పాలి. అలా 50 ఓవ‌ర్లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు స్కోర్ స‌మం చేసి టై చేశారు. దీంతో.. తుది ఫ‌లితాన్ని తేల్చేందుకు సూప‌ర్ ఓవ‌ర్ ను నిర్వ‌హించారు.

సూప‌ర్ ఓవ‌ర్ నిబంధ‌న‌ల ప్రకారం అత్య‌ధికంగా ఫోర్లు కొట్టిన జట్టు విజయాన్ని సొంతం చేసుకుంటుంది. సూప‌ర్ ఓవ‌ర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు రెండు ఫోర్ల సాధించ‌గా.. కివీస్ జ‌ట్టు ఒక్క సిక్స‌ర్ మాత్ర‌మే కొట్ట‌గ‌లిగింది. దీనికి తోడు చివ‌రి బంతికి ర‌నౌట్ కావ‌టంతో మ్యాచ్ టై అయిన‌ట్లే. కాకుంటే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం సూప‌ర్ ఓవ‌ర్లో ఎవ‌రైతే ఎక్కువ ఫోర్లు కొడ‌తారో వారే విజేత కావ‌టంతో.. చివ‌రి బంతి పూర్తి అయిన వెంట‌నే.. ఇంగ్లండ్ జ‌ట్టు స‌భ్యులు ఆనందంలో మునిగిపోగా.. కివీస్ నిరాశ‌లో మునిగిపోయింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న ప్ర‌పంచక‌ప్ త‌మ సొంతం కాగానే భావోద్వేగంతో ఇంగ్లండ్ జ‌ట్టు స‌భ్యులు క‌న్నీరు పెడితే.. చివ‌రి బంతి వ‌ర‌కూ పోటీ ఇచ్చి.. న‌రాలు తెగేంత‌గా ఉత్కంఠ‌కు గురి చేసిన కివీస్.. పోరాడి ఓడిన నిరాశ‌లో క‌న్నీళ్లు పెట్టేశారు.