Begin typing your search above and press return to search.

ప్రపంచ ప్రజలకు పట్టలేదు కానీ బుధవారం ఉదయం 9.27కు పెద్ద విషయమే జరిగింది

By:  Tupaki Desk   |   21 April 2022 3:28 AM GMT
ప్రపంచ ప్రజలకు పట్టలేదు కానీ బుధవారం ఉదయం 9.27కు పెద్ద విషయమే జరిగింది
X
మన కళ్ల ముందు జరిగే అంశాలకు మనమిచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఎందుకిలా అంటే.. దాని కారణంగా ప్రభావితం కావటం.. మన కళ్లతో చూసిన విషయం చిన్నదే అయినా.. దాని తీవ్రతను మనసు పట్టేయటంతో దానికి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇస్తుంటాం. కానీ.. మానవాళిని ప్రభావితం చేసే అంశాలు చాలా వరకు అలా ఓపక్కన ఉండిపోతాయి.

కొందరికి మాత్రమే పరిమితమవుతాయి. అందరిని అంతలా ప్రభావితం చేసే విషయాల గురించి తెలియటం వల్ల అవగాహన పెరగటంతో పాటు.. మనకెదురయ్యే ఇబ్బందుల్ని కాస్తంత ముందే తెలుసుకునే వీలుంటుంది. ఎప్పటిలానే బుధవారం గడిచిపోయింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.27 గంటలకు సూరీడు ఒక్కసారిగా భారీ జ్వాలలు కురిపించాడు.

దీని స్థాయి ఎంతంటే.. జీపీఎస్ వ్యవస్థలు దెబ్బ తినే స్థాయిలో ఇవి నమోదైనట్లుగా పేర్కొంటున్నారు. ఈ జ్వాలల తీవ్రత భారత్ తో పాటు ఆగ్నేయాసియా.. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించినట్లుగా చెబుతున్నారు.

సూరీడి ఆగ్రహ జ్వాలల కారణంగా హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించటం.. ఉపగ్రహాలు.. జీపీఎస్ పని తీరులో లోపాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఎయిర్ లైన్స్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ప్రభావితం కావొచ్చని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా పేర్కొంది. కొన్ని సందర్భాల్లో విద్యుత్ గ్రిడ్లు సైతం ప్రభావానికి గురవుతాయని చెబుతున్నారు.

తాజా జ్వాలల ప్రభావం ఎంతన్న విషయాన్ని అంచనా వేసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని చెప్పాలి. భూకంప తీవ్రతను ఎలా అయితే నెంబర్లలో చూస్తామో.. సూరీడు ఒక్కసారిగా వెలువరించే భారీ సౌర జ్వాలల తీవ్రతను నాసా వర్గీకరణ చేపట్టింది. "ఏ.. బీ.. సీ.. ఎం.. ఎక్స్" తరగతులుగా వర్గీకరించింది.

బుధవారం ఉదయం చోటు చేసుకున్నవి ఎక్స్ తరగతి సౌర జ్వాలలు. అన్నింటికంటే తీవ్రమైనవి "ఎక్స్" తరగతి జ్వాలలు. ఇవి.. ఎం తరగతి కంటే పది రెట్లు.. సీ కంటే వంద రెట్లు తీవ్రత ఉంటుంది. మన రోజువారీ జీవితాల్ని ఇంతలా ప్రభావితం చేసే ఒక పెద్ద పరిణామం ప్రపంచానికి పెద్దగా పట్టకపోవటం గమనార్హం.