Begin typing your search above and press return to search.

పాంచ్ ప‌టాక పేల్చ‌డం పై బీజేపీ ఫోక‌స్‌

By:  Tupaki Desk   |   9 Nov 2021 4:13 AM GMT
పాంచ్ ప‌టాక పేల్చ‌డం పై బీజేపీ ఫోక‌స్‌
X
వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌ పై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో అధికారం ద‌క్కించుకునేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు వ్యూహాల కోసం కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రాల్లోని ప‌రిస్థితులు అనుస‌రించాల్సిన విధానాల‌ పై బీజేపీ క‌స‌ర‌త్తు మొద‌లైంది. దేశ‌ వ్యాప్తం గా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు, ఇటీవ‌ల వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పాటు రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లే ప్ర‌ధాన అజెండాగా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం ఆదివారం ఢిల్లీలో స‌మావేశ‌మైంది. ఈ భేటీ లో ప్ర‌ధాన చ‌ర్చంతా అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ పైనే జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

మ‌రికొన్ని నెల‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల శాస‌న స‌భ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లోనూ గెలిచి పాంచ్ ప‌టాకా మోగించ‌డంపై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. అందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తులు మొద‌లెట్టింది. వ్యూహాల‌పై ధ్యాస పెట్టింది. ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో పంజాబ్ మిన‌హా మిగతా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యంతో ముచ్చ‌ట‌గా మూడోసారి కేంద్రం లో గ‌ద్దెనెక్కాల‌నే ప‌ట్టుద‌ల‌ తో ఉన్న బీజేపీకి.. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఎంతో కీల‌క‌మైన‌వి. ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అధికారం నిలుపుకోవ‌డం ఆ పార్టీకి అత్య‌వ‌స‌రం. అందుకే ఈ రాష్ట్రాల్లో పార్టీ ప‌రిస్థితి మ‌రోసారి అధికారం లోకి రావ‌డం కోసం అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో మేధోమ‌థ‌నం చేశారు.

ప్ర‌ధాన మోడీ ప్ర‌భ కార‌ణంగా 2019 ఎన్నిక‌ల్లోనూ విజ‌య దుందుభి మోగించిన బీజేపీ రెండో సారి కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మోడీకి వ్య‌తిరేకంగా మారుతున్నాయి. క‌రోనా కట్ట‌డిలో విఫ‌లం, రైతు చ‌ట్టాల‌పై మొండి వైఖ‌రి, ఇంధ‌న ధ‌ర‌ల‌ను నియంత్రించ‌లేక‌పోవ‌డం, పెగాస‌స్ వ్య‌వ‌హారం ఇలా మోడీ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి. ఇటీవ‌ల వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ప్ర‌తికూల ఫ‌లితాలే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా దీపావ‌ళి కానుక పేరుతో పెట్ర‌లో పై రూ.5, డీజీల్‌ పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం త‌గ్గించింది. ఇప్పుడికి అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లపై దృష్టి పెట్ట‌నుంది. మ‌రి అక్క‌డి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను తెలుసుకుని మోడీ అమిత్ షా ద్వ‌యం ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు సాగుతుందో చూడాలి.