Begin typing your search above and press return to search.

కాపులే కాషాయం టార్గెట్...?

By:  Tupaki Desk   |   28 March 2022 9:30 AM GMT
కాపులే కాషాయం టార్గెట్...?
X
ఏపీ రాజకీయాల్లో గేర్ మార్చాలని బీజేపీ చూస్తోంది. ఎంతసేపూ పక్క వాయిద్యంగా మిగిలిపోతున్నామన్న బాధ అయితే కనిపిస్తోంది. అదే సమయంలో కేంద్రంలో మోడీ ఇమేజ్ వెలుగులలో కొన్ని అయినా ఇటు వైపు ప్రసరించుకుంటే ఏపీలో వైభవం వస్తుందని ఆశలు కూడా ఉన్నాయి. ఇక ఉత్తరాదిన మతం కార్డు బాగా ఉపయోగపడుతుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో అది ఏ మాత్రం వర్కౌట్ కాదు.

అందుకే చాలా ఆలస్యంగా అయినా బీజేపీ విషయం గ్రహించింది అంటున్నారు. ఇపుడు కులం కార్డుతోనే గేమ్ గెలవాలని బీజేపీ డిసైడ్ అయింది. ఏపీలో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులను ఆకట్టుకుంటే తమ పంట పండినట్లే అని ఆ పార్టీ తలపోస్తోంది.

ఇది గత కొంతకాలంగా సాగుతున్న వ్యవహారమే అయినా ఇపుడు జోరు పెంచడంతో బీజేపీ రాజకీయం మీద అందరూ దృష్టి పెడుతున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కన్నా లక్ష్మీనారాయణను తెచ్చి పెట్టడం వెనక పక్కా క్యాస్ట్ పాలిటిక్స్ ఉంది. అయితే కన్నా కాపులను పార్టీ దరికి చేర్చడంతో ఫెయిల్ అయ్యారు.

ఈ క్రమంలో ఆరెస్సెస్ తో పాటు బీజేపీతో గట్టి బంధం వేసుకున్న గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేత సోము వీర్రాజుని ప్రెసిడెంట్ చేశారు. ఆయన వచ్చాక పార్టీ ఎంతవరకు ఎందిగింది అంటే జవాబు లేని ప్రశ్నగా ఉంది. దాంతో కాపులను సోలోగానే తమ వైపు తెచ్చుకోవాలన్న ఆశ, ధ్యాసలతో బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు.

తాజాగా కర్నూల్ జిల్లా అహోబిలంలో రాయలసీమ బలిజ సంఘాల నేతలతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం కావడంతో బీజేపీ అజెండా ఏంటి అన్నది స్పష్టమైపోయింది. కాపులను వివిధ ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా పిలుస్తారు. తూర్పు కాపులు, ఒంటరి, కాపులు, బలిజలు ఇలా వారు ఏపీలో ఉన్నారు. సీమలో బలిజలుగా ఉన్న కాపులను జీవీఎల్ పనిగట్టుకుని దువ్వడం వెనక కమల రాజకీయం ఇమిడి ఉందని అంటున్నారు.

రాయలసీమలో బీసీలు, బలిజలు ఎక్కువ. కానీ రాజకీయంగా వారు డామినేటింగ్ రోల్ ప్లే చేయలేకపోతున్నారు. వారికి బీజేపీ తరఫున అవకాశం ఇస్తామని చెప్పడమే బీజేపీ ఉద్దేశ్యమని అంటున్నారు. ఇదే జీవీఎల్ చేత బీజేపీ ఈ మధ్య కాలంలో కాపులకు అనుకూలంగా అనేక ప్రకటనలు కూడా చేయించింది. కాపులకు అగ్ర వర్ణ రిజర్వేషన్లలో అయిదు శాతం ఇవ్వాలని జీవీఎల్ తరచూ డిమాండ్ చేస్తున్నారు.

ఆయనే దీని మీద రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కాపుల రిజర్వేషన్ రాష్ట్రాల చేతులల్లో ఉందని కేంద్ర మంత్రి చేత చెప్పించారు. ఇపుడు ఆ ఇష్యూ ఒక వైపు ముందుకు తీసుకుపోతూనే కాపులకు ఏపీలో పెద్ద పీట వేస్తామని బీజేపీ చెప్పదలచుకుంది అని అర్ధమవుతోంది. బీజేపీ జనసేన పొత్తు వెనక కూడా కాపు ఓట్ల ఆశలు ఉన్నాయి.

మరి బీజేపీ ఇన్నాళ్ళకు సరైన రూట్లోనే వెళ్తోంది. కాపులను అక్కున చేర్చుకుంటే అందలం చేరడానికి దారి దొరుకుతుంది అన్నది రాజకీయ తెలివిడిగానే చూస్తున్నారు. ఏపీలో కాపులు అయితే ఐక్యంగా లేరు. వారు టీడీపీ వైసీపీల మధ్య చీలిపోయారు. ఇక వారి మద్దతుతోనే రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి.

మరి వారికే రాజ్యాధికారం అప్పగిస్తామని బీజేపీ చెబుతోంది. ఫస్ట్ టైం ఏపీలో కాపు ముఖ్యమంత్రిని తాము చేస్తామని అంటోంది. బీజేపీ స్లోగన్ కనుక గన్ లా పేలితే ఏపీ రాజకీయాల్లో సమీకరణలే మారిపోతాయి. కానీ బీజేపీ కేవలం కులాన్నే నమ్ముకుని ఏపీ అభివృద్ధి విభజన హామీలను పక్కన పెడితే కులం ఈక్వేషన్స్ గెలిపిస్తాయా అన్నది కూడా చూడాలి. ఒక వైపు ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడం మీద పార్టీలు, కులాలకు అతీతంగా జనాలు మండుతున్నారు.

ప్రత్యేక హోదాని కాదండం, పోలవరానికి కొర్రీలు పెట్టడం విభజన హామీలు నెరవేర్చకపోవడం బీజేపీకి శాపాలుగా మారుతున్నాయన్నది ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది అంటున్నారు. అవన్నీ పూర్తి చేసి కులాలను నమ్ముకుంటే బీజేపీకి ఏపీ రాజకీయాల్లో రాజమార్గం దొరుకుతుంది అంటున్నారు.