Begin typing your search above and press return to search.

కరోనా రీసెర్చ్‌ కి 93 ఏళ్ల వృద్దురాలి శవం .. దేశంలోనే మొదటి మహిళ !

By:  Tupaki Desk   |   21 May 2021 3:43 AM GMT
కరోనా రీసెర్చ్‌ కి 93 ఏళ్ల వృద్దురాలి శవం .. దేశంలోనే మొదటి మహిళ !
X
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు , వేలకొద్ది మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే .. తాజాగా కోల్‌కతాకు చెందిన 93 ఏళ్ల జ్యోత్స్నా బోస్ అనే కార్మిక నాయకురాలి మృతదేహాన్ని కరోనా మెడికల్ రీసెర్చ్ కోసం ఆమె కుటుంబ సభ్యులు గందర్పన్ అనే ఓ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. దేశంలో కరోనా పరిశోధనల కోసం ఒక మహిళ మృతదేహాన్ని దానం ఇవ్వడం ఇదే మొట్ట మొదటిసారి కావడం గమనార్హం. జ్యోత్స్నా బోస్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. ఆరోగ్యం క్షీణించడంతో మే 14న కోల్‌కతాలోని బెలియఘటా ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆస్పత్రిలోనే కన్నుమూశారు. జ్యోత్స్నా మృతి అనంతరం ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గందర్పన్ స్వచ్చంద సంస్థకు అప్పగించారు.

కరోనా పరిశోధనల నిమిత్తం ఆమె మృతదేహాన్ని దానం చేశారు. దేశంలో ఒక మహిళ మృతదేహాన్ని కరోనా పరిశోధనలకు దానం చేయడం ఇదే మొదటిసారి. దీనిపై జ్యోత్స్నా బోస్ మనువరాలు డా.బసు మాట్లాడుతూ...కరోనా వైరస్ అనేది ఒక కొత్త వైరస్ కావడం వల్ల దాని గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదు. మనిషి శరీరంలోని అవయవాలు,అవయవ వ్యవస్థలపై అది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పోస్టుమార్టమ్ ప్రక్రియ ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు. గందర్పన్ సంస్థ వ్యవస్థాపకులు బ్రొజో రాయ్, అప్తమాలజిస్ట్ డా.బిశ్వజిత్ చక్రవర్తి కూడా తమ మరణానంతరం మృతదేహాలను కరోనా మెడికల్ రీసెర్చ్ నిమిత్తం దర్పన్ సంస్థకు అప్పగించారు. జ్యోత్స్నా బసు 1927లో ఇప్పటి బంగ్లాదేశ్‌ లోని చిట్టగాంగ్‌ లో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా నుంచి భారత్‌ కు వస్తున్న సమయంలో ఆమె తండ్రి కనిపించకుండా పోయారు. ఆ తర్వాత ఆమె కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఆ కారణంగా ఆమె చదువు కూడా సజావుగా సాగలేదు. బ్రిటీష్ టెలిఫోన్స్‌ లో ఆపరేటర్‌ గా పనిచేస్తూ ఆమె తన చదువును కొనసాగించింది. ఆ తర్వాతి కాలంలో కోల్‌కతాలో కార్మిక సంఘ ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు. తన జీవిత కాలం మొత్తం సామాజిక,రాజకీయ కార్యక్రమాలతో నిత్యం బిజీగా గడిపారు.