Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బెంగళూరుకు నవీన్ మృతదేహం

By:  Tupaki Desk   |   19 March 2022 2:33 AM GMT
ఎట్టకేలకు ఉక్రెయిన్ నుంచి బెంగళూరుకు నవీన్ మృతదేహం
X
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో మృతిచెందిన భారతీయ విద్యార్థి నవీన్ మృతదేహం 20 రోజుల అనంతరం సోమవారం బెంగళూరుకు చేరుకోనుంది. మొదట ఆదివారం చేరుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం సాయంత్రం తెలిపారు. తాజాగా అది మరింత ఆలస్యం అయ్యిందన్నారు.

ఉక్రెయిన్ లో మృతిచెందిన నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం ఉదయం 3 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చివరి సంవత్సరం చదువుతున్న నవీన్ మార్చి 1న రష్యా చేసిన బాంబు దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరడంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది.

నవీన్ తండ్రి కూడా తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని ప్రధాని మోడీ, కర్ణాటక సీఎం ను అభ్యర్థించారు. దాదాపు 19 రోజులుగా నవీన్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఉక్రెయిన్ లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నవీన్ మృతదేహం తరలింపులో జాప్యం చోటుచేసుకుందని అధికారవర్గాలు తెలిపాయి.

నవీన్ ఎలా చనిపోయాడంటే?
21 ఏళ్ల భారతీయ వైద్య విద్యార్థి నవీన్ ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో చనిపోయాడు. ఇలా చనిపోయిన మొదటి భారతీయ విద్యార్థి నవీన్ కావడం విషాదం నింపింది.తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలోని విద్యార్థుల బృందం బాంబు దాడులు తీవ్రంగా జరిగిన తర్వాత కర్ఫ్యూ సడలించడంతో విద్యార్థుల గుంపుగా రష్యా సరిహద్దుకు సమీపంలో నైరుతి దిశలో హంగేరియన్ సరిహద్దు వరకు వెళ్లారు. 1,500 కి.మీల దూరంలోని ఇక్కడికి చేరుకోవడానికి రిస్క్ తీసుకున్నారు.

సోమవారం ఒక బృందం బయలుదేరింది. ఉక్రెయిన్‌కు కొత్తవారు కాబట్టి జూనియర్‌లను తమ వెంట తీసుకెళ్లడానికి వేచి ఉండాలని నవీన్ ఇతరులకు సూచించాడు. బుధవారం ఉదయం ఖార్కివ్‌ను విడిచిపెట్టాలని నవీన్ ఆలోచన. గత ఆరు రోజులుగా విద్యార్థులు పడిగాపులు కాస్తున్న బంకర్ నుంచి మంగళవారం ఉదయం నవీన్ కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చాడు. "కర్ఫ్యూ ఎత్తివేసినప్పుడల్లా కిరాణా సామాను కొనడానికి అతడు బయటకు వెళ్తాడు" అని తోటి విద్యార్థి చెప్పారు.

నవీన్ తన స్నేహితులందరికీ ఆహారం తీసుకురావడానికి మార్కెట్‌కు బయలుదేరాడు. అది బంకర్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉంది. “ఉదయం 7.58 గంటలకు, అతను మాలో ఒకరికి సందేశం పంపాడు, తనకు డబ్బు కొరత ఉందని..అతని ఖాతాకు కొంత బదిలీ చేయమని అడిగాడు. మాలో ఒకరు ఉదయం 8.10 గంటలకు అతని ఫోన్‌కి కాల్ చేసారు, కానీ ఒక ఉక్రేనియన్ కాల్‌కు సమాధానం ఇచ్చాడు. అతను బాంబు దాడిలో చనిపోయాడని.. ఇక లేడని చెప్పాడు, ”అని దీంతో నవీన్ స్నేహితులు బోరుమన్నారు. "అతను మాకు ఆహారం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బాంబు దాడిలో మరణించాడని" తోటి విద్యార్థులు ఏడుస్తూ వివరించారు. ఇలా తోటి విద్యార్థులను ప్రాణాలను ఫణంగా పెట్టిన నవీన్ ధైర్యానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

నవీన్‌ గవర్నర్‌ హౌస్‌కు సమీపంలోనే దుకాణం ముందు ఆహారం కోసం క్యూలో నిల్చున్నాడు. అకస్మాత్తుగా రష్యా వైమానిక దాడి చేసింది. అది గవర్నర్ హౌస్‌ను పేల్చివేసింది. ఈ దాడిలో నవీన్ మరణించాడు.

నవీన్ బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న హవేరి జిల్లాకు చెందినవాడు మరియు అతని తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడర్ రిటైర్డ్ ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నవీన్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసినట్లు శేఖరప్ప తెలిపారు.