Begin typing your search above and press return to search.

ఏపీలో పాపాగ్ని వంతెనను పొట్టన పెట్టుకున్న పాడు వాన

By:  Tupaki Desk   |   21 Nov 2021 7:34 AM GMT
ఏపీలో పాపాగ్ని వంతెనను పొట్టన పెట్టుకున్న పాడు వాన
X
పాడు వాన ఏపీని పట్టి పీడిస్తోంది. వారానికి పైనే ముసురుపట్టిన వేళ.. వచ్చి పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. మొదట్లో తాజా వానలు తమిళనాడును మరీ ముఖ్యంగా చెన్నై పట్టణానికి ఇబ్బందికి గురి చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకు భిన్నంగా ఊహించని రీతిలో చిత్తూరుతోపాటు సీమలోని పలు జిల్లాలు భారీ వర్షం కారణంగా అతలాకుతలమైన పరిస్థితి. ఏపీలోని మిగిలిన జిల్లాల్లోని ఇలాంటి పరిస్థితే నెలకొంది.

భారీగా కురిసిన వానలకు పలు గ్రామాలు నీట మునిగిపోవటమేకాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు కూడా వరద ప్రవాహంలో చిక్కుకుపోయి.. పలువురు గల్లంతైన దారుణ పరిస్థితి ఏపీలో నెలకొంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెన కూలిపోవటం షాకింగ్ గా మారింది. శనివారం అర్థరాత్రి తర్వాత కూలిపోయిన ఈ వంతెన కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి.

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లను ఎత్తేయటంతో భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు రెండు రోజులుగా ప్రవహిస్తోంది. దీంతో.. వంతెన పెద్ద ఎత్తున నానటం.. వరద పోటు తీవ్రతకు వంతెన నిర్మాణానికి నష్టం వాటిల్లుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్లే శనివారం సాయంత్రం నుంచి వంతెన కుంగుతున్న వైనాన్ని అధికారులు గుర్తించారు.

శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత వంతెన ఏడు మీటర్లకుపైనే కూలిపోవటంతో కిలోమీటర్ దూరంలోనే వాహనాల్ని నిలిపివేయటం పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. అనంతపురం - కడపకు వెళ్లేందుకు వీలుగా నెలకొల్పిన ఈ జాతీయరహదారిలో కీలకమైన వంతెన కూలిపోవటంతో రాకపోకలు పెద్ద ఎత్తున బంద్ అయ్యాయి.

దీంతో కడప నుంచి అనంతపురం వెళ్లే వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు. కడప నుంచి తాడపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు మొదలు కొని ఇతర వాహనాలను ప్రొద్దుటూరు.. ఎర్రగుంట్ల.. మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు.

అధికారుల అంచనా ప్రకారం.. ఈ మార్గాన్ని పునరుద్ధరించటానికి కనీసం నెల రోజులు పడుతుందని చెబుతున్నారు. వరద తీవ్రత కారణంగా.. వంతెన ఏ మేరకు దెబ్బ తిందన్న విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మరింత స్పష్టత వచ్చే వీలుందని చెబుతున్నారు.

మొత్తంగా పాడు వాన సీమలోని రెండు ప్రధాన జిల్లాలకు చెందిన వారికి భారీ షాక్ నే ఇచ్చిందని చెప్పాలి. ఈ వంతెనకు ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారిని వినియోగించటం కారణంగా.. ప్రయాణ సమయం పెరగటంతో పాటు.. నేషనల్ హైవే రోడ్లతో పోల్చినప్పుడు మిగిలిన రోడ్లు అంత సరిగా ఉండని కారణంగా.. ప్రయాణ ఇబ్బందులు మరింతగా పెరగనున్నాయి.