Begin typing your search above and press return to search.

దూసుకుపోతున్న 'కూ'.. ట్విట్టర్ ను ఓడించడమే లక్ష్యం

By:  Tupaki Desk   |   7 Feb 2022 11:30 PM GMT
దూసుకుపోతున్న కూ.. ట్విట్టర్ ను ఓడించడమే లక్ష్యం
X
మైక్రో బ్లాగింగ్ యాప్ లు ఇటీవల దూసుకుపోతున్నాయి. మన దేశంలో ట్రెండింగ్ లో ఉన్న షేర్ చాట్ తో "కూ" పోటీ పడుతోంది. అంతే కాకుండా యూజర్లను పెంచుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 2022 లో పది కోట్ల మందికి చేరువ కావాలని సన్నాహాలు చేస్తోంది. అయితే ఉన్నట్టుండి ఈ కూ యాప్ ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? కేబినెట్ మినిస్టర్లు సైతం దీనిని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇందుకు కేంద్రం హస్తం ఉందా? అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు .

ఇటీవల సామాజిక దిగ్గజ ఫ్లాట్ ఫాం ట్విట్టర్ కు భారత సర్కార్ కాస్త బేధాభిప్రాయాలు తలెత్తాయి. అభ్యంతరకర అకౌంట్లను తొలగించాలని కేంద్రం కోరితే... ట్విట్టర్ అందుకు నిరాకరించింది. కొన్ని అకౌంట్లను తీసేసినా.. మరికొన్నింటిని ఆధారాలు లేవని అలాగే ఉంచేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాలకు లోబడి నడుచుకోవాలని ట్విట్టర్ కు గట్టిగా చెప్పింది. అయినా కూడా ట్విట్టర్ ఏమాత్రం మార్పు చేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వం తాజాగా రూపొందించిన డిజిటల్ నిబంధనలు కూడా విరుద్ధంగా ఉన్నాయి. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించేలా ఇవి ఉన్నాయని వాట్సాప్ ఇప్పటికే కోర్టులో కేసు కూడా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం... ట్విట్టర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని నెటిజన్లు అనుమానిస్తున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే మైక్రో బ్లాగింగ్ యాప్ కూ తెర మీదకు వచ్చింది. ఈ యాప్ కు మారాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. రాత్రికి రాత్రే కేబినెట్ మినిస్టర్స్ సైతం ఈ యాప్ లో చేరారు. అయితే ప్రధాని మోదీ మాత్రం ఇంకా ట్విట్టర్ లో కొనసాగుతున్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ వల్ల ఇప్పుడే ట్విట్టర్ ను వదులుకోలేరని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఈ యాప్ మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని... ముస్లింలకు వ్యతిరేకంగా పని చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే... ఆయన మద్దతుదారులు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ చేస్తారు. ఈ నేపథ్యంలో తమ యాప్ విద్వేషపూరిత, అభ్యంతరకరమైన కంటెంట్ ను నిషేధిస్తుందని కూ స్పష్టం చేసింది.

కూ యాప్ ను అపర్మేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్క అనే ఇద్దరు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు దీనిని 2020లో ప్రారంభించారు. నైజీరియాలో ట్విట్టర్ ను నిషేధించింది. దాంతో ఆ దేశంలో దీనిని ప్రవేశపెట్టారు.2022 నాటికి పది కోట్ల మంది యూజర్లకు చేరువ కావాలని కూ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా కూ లో చేరుతున్నారు. గతేడాది ఉన్న 5000 మంది సెలబ్రిటీల సంఖ్య... ఈ ఏడాది మూడు రెట్లు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పై ఓడామా? గెలిచామా? అన్నది కాదు.. ఈ ఏడాది ట్విట్టర్ ఖాతాదారులను మించిపోవాలన్నది మా ఆకాంక్ష అని కూ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్క అన్నారు. ఈ ఏడాది ఎక్కువ ఖాతాదారులు వస్తారని అంచనా వేశారు. సమాజంలో ఒక వర్గానికి పరిమితం కామని... వ్యాపారవేత్తలుగా అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా అభివృద్ధి చేశామని తెలిపారు. ఇంగ్లీషు రాని వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే కూ యాప్ కు ఫోన్ నెంబర్ తప్పనిసరి అనేది అతి పెద్ద సవాలుగా మారుతుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అయితే ట్విట్టర్ ను నిషేధిస్తే దీనికి మంచి ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.