Begin typing your search above and press return to search.

48 రాష్ట్రాల్లో ఒకేసారి ఫేస్ బుక్ పై కేసు

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:17 AM GMT
48 రాష్ట్రాల్లో ఒకేసారి ఫేస్ బుక్ పై కేసు
X
ఫేస్ బుక్ వైఖరిపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. వ్యాపారంలో ఏకఛత్రాధిపత్యం కోసం ఫేస్ బుక్ తీవ్రంగా ప్రయత్నిస్తోందంటూ అమెరికాలోని 48 రాష్ట్రాల్లో ఒకేసారి ఫేస్ బుక్ పై కేసు నమోదైంది. ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకెర్ బర్గ్ చేస్తున్న అనారోగ్యకరమైన పనుల వల్ల వినియోగదారులకు చాయిస్ లేకుండా పోతోందంటూ కోర్టుల్లో 48 రాష్ట్రాల ప్రభుత్వాలు వాదించాయి.

అగ్రరాజ్యంలోని 48 రాష్ట్రాలకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమీషన్ తరపున అటార్నీ జనరళ్ళు కేసులు దాఖలు చేయటం సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున డబ్బులను ఆశచూపించి చిన్న సంస్ధలను జూకెర్ బర్గ్ వశం చేసుకుంటున్నట్లు ఫెడరల్ ట్రేడ్ కమీషన్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. సోషల్ మీడియాలో ఏకఛత్రాధిపత్యం కోసం జూకెర్ బర్గ్ చేయకూడని పనులన్నింటినీ చేస్తున్నట్లుగా కమీషన్ మండిపడింది.

2012లో తన ప్రత్యర్ధి అయిన ఇన్ స్టా గ్రమ్ ను 1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఫేస్ బుక్ 2014లో వాట్సప్ యాప్ ను 19 బిలియన్ డాలర్లకు కొనేసినట్లు కమీషన్ వివరించింది. తనకు ఏదైనా సంస్ద పోటి వస్తుందని అనుకుంటే చాలు వెంటనే ఏదో ఓ పద్దతిలో కొనుగోలు చేసేస్తోందంటూ ఫెడరల్ కమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

సరే అందరు అనుకున్నట్లుగానే కేసులను, వాదనలను జూకెర్ బర్గ్ ఖండించారు. కావాలనే ప్రభుత్వం తనపై కేసులు వేసిందంటూ మండిపోయారు. కోర్టు కేసుల నేపధ్యంలో ఫేస్ బుక్ షేర్లు దెబ్బతిన్నాయి. మరి వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ లను అమ్మకానికి పెట్టడం తప్ప జూకెర్ బర్గ్ కు వేరే మార్గం లేదంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.