Begin typing your search above and press return to search.

మ‌నోళ్ల కుల గజ్జి!..విదేశాల‌కూ అంటుకుంటోందే!

By:  Tupaki Desk   |   2 April 2018 8:58 AM GMT
మ‌నోళ్ల కుల గజ్జి!..విదేశాల‌కూ అంటుకుంటోందే!
X
భార‌త దేశంలో ఉన్న‌న్ని కులాలు ప్ర‌పంచంలోని మ‌రే దేశంలోనూ లేవు. అంతేనా... భార‌త్ లో ఉన్నంత కుల వివ‌క్ష మ‌రే దేశంలోనూ క‌నిపించ‌దు. అయినా ఆ దేశాల్లో కుల భావ‌న ఉంటే క‌దా వివ‌క్ష అన్న మాట వినిపించేది. అగ్ర‌రాజ్యం అమెరికా, మ‌రికొన్ని దేశాల్లో కేవ‌లం శ‌రీర వ‌ర్ణాన్ని బ‌ట్టి శ్వేత‌, న‌ల్ల జాతీయుల‌న్న తేడా అయితే ఉంది గానీ... మ‌న వ‌ద్ద ఉన్న‌ట్లుగా లెక్క‌లేనన్ని వ‌ర్గాలు, కులాలు, గోత్రాలు, ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గం నిర్దేశించుకున్న క‌ట్టుబాట్లు, ఇత‌ర కులాల ప‌ట్ల ఆయా కులాల వారు చూపుతున్న వివక్ష గానీ ఇత‌ర దేశాల్లో లేవ‌నే చెప్పాలి. మొత్తంగా మ‌న‌కు మ‌నం నిర్దేశించుకున్న ఈ క‌ట్టుబాట్ల కార‌ణంగా హిందూ సంప్ర‌దాయాల్లో స‌మున్న‌త స్థానంలో ఉన్న బార‌త్ కు వ‌ర్గ వివ‌క్ష‌లో అగ్ర‌స్థానాన్ని ఇచ్చేశాం. కాస్తంత ప‌చ్చిగా చెప్పాలంటే మ‌న దేశానికి మ‌న‌మే ప్ర‌పంచ దేశాల దృష్టిలో కుల గ‌జ్జి క‌లిగిన దేశంగా బిరుదు ఇచ్చేసుకున్నామ‌ని చెప్పాలి. అయినా ఈ విష‌యాన్ని ఇప్పుడు ఇంత‌గా ఎందుకు ప్రస్తావించుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటే... మ‌నోళ్ల కుల గజ్జి... మ‌న దేశంలో ఉన్న‌ప్పుడే కాకుండా ఇత‌ర దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ట‌. అంతేకాదండోయ్‌... మ‌న‌కున్న కుల గ‌జ్జిని మ‌నోళ్లు ఇత‌ర దేశాల‌కూ అంటించేస్తున్నార‌ట‌.

ఈ క‌థా క‌మామీషు పూర్తి వివ‌రాల్లోకి వెళితే...అభివృద్ధి చెందిన సమాజాల్లో నివసిస్తున్నా- భారతీయులు కులం కొమ్మల్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. అమెరికాలో ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉన్నట్లు *ఈక్వాలిటీ లాబ్స్‌* అనే సంస్థ చేసిన ఓ తాజా సర్వే తేల్చింది. అమెరికాలోని దక్షిణాసియా సంస్థల్లోని ఉద్యోగులు - విద్యార్థులు- ముఖ్యంగా దళితులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు ఆ సర్వే చెబుతోంది. 1500 మంది దక్షిణాసియా జాతీయత ఉన్నవారిని ప్రశ్నించినపుడు కులం వారినెంతగా కాటేస్తోందో - కుల వివక్ష వల్ల తామెంత నష్టపోతున్నామో క‌ళ్లకు క‌ట్టిన‌ట్టుగా చెబుతున్న వైనాన్ని ఈ సర్వే వెల్ల‌డించింది. 2016లో జ‌రిగిన ఈ సర్వే నివేదిక గ‌త వారం విడుద‌లైంది. ఈ నివేదిక‌లోని అంశాల‌ను ప‌రిశీలిస్తే... చాలా ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 2016లో చేసి- నివేదికను గురువారం నాడు విడుదల చేశారు. అమెరికన్‌ భారతీయుల్లో కుల వివక్ష ఎప్పటి నుంచో ఉందట‌. దళిత అమెరికన్లుగా పెరిగిన తాము చాలా ఏళ్లుగా ఈ బాధ అనుభవిస్తున్నామ‌ని, అయితే సరైన డేటా లేకపోవడం, అనాసక్తి వల్ల సవర్ణ మేధావులెవరూ దీనిపై దృష్టిపెట్టలేదని. అందువల్ల దీనిపై అధ్యయనం జరగలేదని ఈక్వాలిటీ ల్యాబ్స్‌ సహవ్యవస్థాపకుడు థెనిమొళి సౌందరరాజన్‌ చెప్పారు. ఈ సర్వే ప్రకారం అక్క‌డి ద‌ళితుల్లో 26 శాతం మంది హింసను - భౌతిక దాడులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో వివక్షకు గురైనట్లు, నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్నా తమను వెనక్కి నెట్టేసినట్లు మరో 20 శాతం మంది దళితులు వెల్లడించారు.

ఇక మత విషయకంగా చూస్తే- 40 శాతం మంది దళితులకు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశమే గగనమైనట్లు వివరించారు. కులం వల్ల ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో తమను చిన్నచూపు చూస్తున్నట్లు 40 శాతం మంది దళితులు చెప్పారు. తమను కుల హేళన చేసినట్లు, తమపై వ్యంగ్యాస్త్రాలు, వ్యాఖ్యలు, జోకులు విసిరినట్లు 60 శాతం మంది తెలిపారు. స్కూళ్లలో ప్రతీ ముగ్గురు దళిత విద్యార్థులలో ఒకరు వివక్షకు గురవుతున్నారు. శూద్ర కులాలకు చెందిన విద్యార్థులంతా ఎక్కడ తమ కులం సంగతి బయటపడుతుందో, ఎక్కడ తమను సామాజికంగా దూరం పెడతారో అన్న భయంతో కాలం గడుపుతున్నారు. ఇక వ్యాపారస్థుల్లోనూ ఈ ధోరణి ఉంది. వివక్ష ఎదుర్కొంటున్నట్లు 20 శాతం మంది దళిత వ్యాపారులు చెప్పారు. ఏకమొత్తంగా చూస్తే ఆచార వ్యవహారాల్లోనూ, కుల హోదాలోనూ అసమానతలు తారస్థాయిలో ఉన్నాయని ఈ స‌ర్వే నిగ్గు తేల్చింది. దళితులను అక్క‌డ కూడా ఓ రకంగా సామాజికంగా వెలి వేస్తున్నారనే చెప్పాలి. అన్ని దక్షిణాసియా సంస్థల్లోనూ ఇదే తీరు ఉన్న‌ట్టు సర్వే వివరించింది. దేవాలయాల్లో ఈ కుల వివక్ష మరీ ఎక్కువగా కనిపిస్తోందట‌. ద‌ళితుర‌ల‌నే కాకుండా బీసీల‌ను కూడా అగ్ర‌వ‌ర్ణాలు దూరంగా పెట్టేస్తున్నాయట‌. మొత్తంగా విదేశాల‌కు కూడా మ‌నోళ్లు కుల గజ్జి అంటించేస్తున్నార‌న్న మాట‌.