Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్‌పై కేంద్రం తేల్చేసింది.. హైకోర్టుకు ఏం చెప్పిందంటే!

By:  Tupaki Desk   |   28 July 2021 9:44 AM GMT
విశాఖ స్టీల్‌పై కేంద్రం తేల్చేసింది.. హైకోర్టుకు ఏం చెప్పిందంటే!
X
తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లేన‌ని వాదిస్తున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. అనుకున్న‌ది చేసే వ‌ర‌కు నిద్ర‌పోన‌ని తేల్చి చెబుతోంది. ఆంధ్రుల హ‌క్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అయిన‌కాడికి అమ్మేసుకునేందుకు మోడీ స‌ర్కారు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అప్పులు, ఆర్థిక లేమి వంటివాటిని బూచిగా చూపుతోంది. దీనిపై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. కేంద్రం ప‌దే ప‌దే చెబుతోంది. ఈ క్ర‌మంలో ఏపీలో ఆందోళ‌న‌ల‌ను రోడ్డెక్కిన విష‌యం తెలిసిందే.

విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేందుకు వీల్లేద‌ని.. ప్ర‌జాసంఘాలు, ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్య‌మి స్తున్నాయి. రాజ‌కీయ నేత‌లు కూడా.. దీనిలో భాగ‌మ‌య్యారు. విశాఖ ఉత్త‌ర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. త‌న ప‌ద‌వికి రాజీనామా కూడా స‌మ‌ర్పించారు. ఇక‌, ప్ర‌భుత్వం ప‌రంగా కూడా జ‌గ‌న్ లేఖ‌లు రాస్తున్నారు. రాశారు. అయితే.. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌ను మొస‌లి క‌న్నీళ్లుగా ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. మ‌రోవైపు.. కొంద‌రు న్యాయ‌పోరాటం చేస్తున్నారు. కొస‌మెరుపు ఏంటంటే.. క‌రోనా స‌మ‌యంలో ఆక్సిజ‌న్ కొరత ఉన్న‌ప్పుడు.. ఈ ప్లాంటే.. కొన్ని వేల ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను దేశానికి అందించి.. ప్రాణాలు కాపాడింది.

అయిన‌ప్ప‌టికీ.. ఈ ప్లాంటును ప్రైవేటీక‌రించేందుకు మోడీ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌నేది అంద‌రికీ తెలిసిందే. దీనిపై సీబీఐ.. మాజీ జేడీ.. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. న్యాయ‌ప‌రంగా పోరాటం ప్రారంబించారు. ఈ క్ర‌మంలో హైకోర్ట‌లో ఆయ‌న కొన్నాళ్ల కింద‌టే ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం వేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించ‌డం దారుణ‌మ‌ని.. దీనికి రాజ్యాంగం సైతం అంగీక‌రించ‌ద‌ని ఆయ‌న కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ప‌లు ద‌ఫాల విచార‌ణ అనంత‌రం.. తాజాగా.. కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

ఈ తాజా అఫిడ‌విట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు కొన్ని సుద్దులు చెప్పింది. ప‌రిశ్ర‌మ‌ల‌ ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన కేంద్రం.. ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది. వ్యాజ్యం దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని.. రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో పేర్కొంది. లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణ అర్హత లేదని తెలిపింది. మ‌రి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో ... వేచి చూడాలి.