Begin typing your search above and press return to search.

విదేశీ ప్రయాణాలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

By:  Tupaki Desk   |   10 Feb 2022 12:30 PM GMT
విదేశీ ప్రయాణాలపై కేంద్రం కీలక మార్గదర్శకాలు
X
కరోనా పుణ్యమా అని మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. దేశవిదేశాలకు మధ్య సంబంధాలు కొన్నాళ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత నిబంధనలతో కూడిన ప్రయాణాలు సాగాయి. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే తంతు సాగుతోంది.

కాగా మధ్యమధ్యలో కొత్త రూల్స్ వస్తున్నాయి. ఉన్నవాటిని సవరిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కలవరపెట్టిన ఒమిక్రాన్ నేపథ్యంలో వివిధ దేశాల ప్రభుత్వాలు వారి పరిస్థితులకు తగ్గట్లుగా నియమాలు రూపొందించాయి. భారతదేశం కూడా ఎట్ రిస్క్ పేరిట... కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల జాబితాను సిద్ధం చేసింది. వారికి కొన్ని షరతులు వర్తించింది. అయితే తాజాగా వాటిని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడ్డ నేపథ్యంలో మార్గదర్శకాలను గురువారం సవరించింది.

విదేశీ ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎట్-రిస్క్ గా భావించే దేశాలను జాబితాను తీసేసింది. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేవారికి ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలు కూడా ఎత్తివేసింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 14 రోజుల స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా విమాన ప్రయాణాలకు ముందు... సెల్ఫ్ డిక్లరేషన్ ధ్రువపత్రాన్ని నింపాలి. అందులో కరోనా నెగిటివ్ రిపోర్టును పొందుపర్చాలి. లేదంటే వ్యాక్సిన్ రెండు డోసుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్ సువిధ పోర్టల్ ఈ సమాచారాన్ని పొందుపరచాల్సి ఉంటుంది.

విమానం ఎక్కే 72 గంటల ముందు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. దీనికి బదులు టీకా రెండు డోసుల సర్టిఫికెట్ అప్ లోడ్ చేసిన అనుమతిస్తారు. ఈ వివరాలను ఇచ్చిన వారిని మాత్రమే అనుమతించాలని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఉంటే వారిని అనుమతించరు. ఐసోలేషన్ ఉంచిన తర్వాత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే విమానంలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆరోగ్య సిబ్బందికి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. ప్రోటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్ ఉంచాలి. అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ వస్తే... వారి కాంటాక్ట్ ను ట్రేజ్ చేస్తారు.

ఇక విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఈ విధంగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎట్ రిస్క్ గా ఉన్న జాబితాను తీసేసింది. ఇక కరోనా కేసులు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ సంకేతాలు కూడా ముగిసినట్లేనని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.