Begin typing your search above and press return to search.

125 ఏళ్ల స్వామిని పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం

By:  Tupaki Desk   |   22 March 2022 9:30 AM GMT
125 ఏళ్ల స్వామిని పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం
X
రాష్ట్రపతి భవన్‌లోని రాజభవనమైన దర్బార్ హాల్‌లో చెప్పులు లేకుండా నడిచిన 125 ఏళ్ల స్వామి శివానంద ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును చాలా సాదాసీదాగా అందుకొని ఆశ్చర్యపరిచాడు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన సందర్భంగా స్వామివారికి ఘనస్వాగతం లభించింది.

యోగసాధకుడైన స్వామి అవార్డు అందుకోవడానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతికి సాష్టాంగ నమస్కారం చేయడం ఈ కార్యక్రమంలో విశేషం. ప్రధాని మోదీ వెంటనే వంగి నేలను తాకి శుభాకాంక్షలు తెలిపారు.

యోగా గురువు తెల్లటి కుర్తా, ధోతీ ధరించి, డయాస్‌పైకి వెళ్లే ముందు మళ్లీ రెండుసార్లు మోకరిల్లారు. అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందించడం ద్వారా శివానంద తన పాదాలకు నమస్కరించడానికి వస్తే రాష్ట్రపతి అతడిని వారించి పైకి లేపడం చూశాం. వీవీఎస్ లక్ష్మణ్, ఆనంద్ మహీంద్రా, కేంద్ర న్యాయశాఖ మంత్రితో సహా పలువురు ప్రముఖులు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

స్వామి శివానంద తన జీవితాన్ని మానవ సమాజ శ్రేయస్సు కోసం అంకితం చేశారు. అతని జీవనశైలి చాలా సరళమైనది. ఉదయాన్నే యోగా, నూనె లేని ఉడికించిన ఆహారం. మానవాళికి నిస్వార్థ సేవతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అతను 125 సంవత్సరాల వయస్సులో వ్యాధి రహితంగా ఇంకా యాక్టివ్ గా ఉండడం విశేషం. 1896 ఆగస్టు 8న సిల్హెట్ జిల్లాలో జన్మించిన స్వామి శివానంద ఆరేళ్ల వయస్సులో తన తల్లి మరియు తండ్రిని కోల్పోయాడు.

అతను సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. అతను తన వయస్సులో "యోగా, క్రమశిక్షణ మరియు బ్రహ్మచర్యం"కి రుణపడి ఉన్నానని చెప్పాడు. గత 50 సంవత్సరాలుగా, స్వామి శివానంద 400-600 మంది కుష్టువ్యాధి పీడిత బిచ్చగాళ్లను పూరీలో వ్యక్తిగతంగా వారి గుడిసెల వద్ద కలుసుకుని గౌరవప్రదంగా సేవ చేస్తున్నారు.

స్వామి 30 నవంబర్ 2019న సమాజానికి చేసిన కృషికి గానూ 2019లో బెంగళూరులో యోగా రత్న అవార్డు.. రెస్పెక్ట్ ఏజ్ ఇంటర్నేషనల్ ద్వారా బసుంధర రతన్ అవార్డుతో సహా పలు అవార్డులతో సత్కరించబడ్డారు.