Begin typing your search above and press return to search.

రైతుల ఆందోళన , కేంద్రం కొత్తవ్యూహం : 700 జిల్లాలు , 700 సమావేశాలు ..100 ప్రెస్ మీట్స్ !

By:  Tupaki Desk   |   11 Dec 2020 2:30 PM GMT
రైతుల ఆందోళన , కేంద్రం కొత్తవ్యూహం : 700 జిల్లాలు , 700 సమావేశాలు ..100 ప్రెస్ మీట్స్  !
X
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రం రైతులతో చర్చలు జరిపినప్పటికీ కూడా అవి సఫలం కాలేదు. కేంద్రం వెనక్కి తగ్గడం లేదు , రైతులు అంతకంటే వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం సరికొత్త వ్యూహం తో ప్రజల ముందుకు రాబోతుంది. అతి త్వరలోనే దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 100 ప్రెస్‌ మీట్స్,రైతులతో 700 సమావేశాలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా కొత్త చట్టాల వల్ల కలిగే మేలు గురించి రైతు లోకానికి తెలియజేయాలని భావిస్తోంది.

ఈ సమావేశాల్లో ‌ లో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారని , ఒకరకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనకు కౌంటర్‌ గా ఈ క్యాంపెయిన్ ‌ని చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రం నిర్వహించబోయే క్యాంపెయిన్‌ లో కొత్త చట్టాలకు సంబంధించి రైతులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రమంత్రులు వివరణాత్మక సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా కొత్త వ్యవసాయ చట్టాలకు రైతుల నుంచి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ ముందుకు సాగబోతోంది.

ప్రభుత్వం రైతులను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ... వారు వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు కార్పోరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని వాపోతున్నారు. క్రమంగా వ్యవసాయాన్ని కార్పోరేట్లు ఆక్రమిస్తారని... ఫలితంగా రైతులు కూలీలుగా మారే ప్రమాదం తలెత్తుందని వాపోతున్నారు.