Begin typing your search above and press return to search.

భారతీయులకు ముక్క లేనిదే ‘ముద్ద’ దిగేలా లేదుగా..!

By:  Tupaki Desk   |   3 Nov 2022 11:30 PM GMT
భారతీయులకు ముక్క లేనిదే ‘ముద్ద’ దిగేలా లేదుగా..!
X
ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న నానుడిని మన భారతీయులు నిజం చేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతీయులు క్రమంగా తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. కరోనా ఎంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య పెరుగుతుండగా భారత్ లో మాత్రం ఇందుకు భిన్నంగా మాంసాహారుల సంఖ్య పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

స్టాటిస్టా గ్లోబల్ కన్జూమర్ సర్వే ప్రకారం.. కరోనా ఎంట్రీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రతీఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్దను కనబరుస్తున్నారని సర్వేలో తేలింది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో శాకాహారుల సంఖ్య పెరిగినట్లు వెల్లడైంది. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం శాకాహారుల సంఖ్య పెరిగింది.

భారత్ లో 2018 సంవత్సరంలో పోలిస్తే ప్రస్తుతానికి శాకాహారుల సంఖ్య బాగా తగ్గిపోయిందని తేలింది. సాంప్రదాయ శాకాహారులు సైతం సర్వ భక్షకులుగా మారిపోతున్నారని స్టాటిస్టా గ్లోబల్ కన్జూమర్ సర్వే పేర్కొంది. 2018 నాటికి భారత్ లో పట్టణ వాసుల్లో మూడో వంతు శాకాహారులుగా పేర్కొన్నారు. 2021-22 నాటికి ఆ శాతం ఒక్క శాతానికి పడిపోయిందని తాజా సర్వేలో వెల్లడి కావడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో వెజ్ టేరియన్ డైట్ కు ఆదరణ పెరుగుతుండగా కొన్ని దేశాలు మాత్రం మాంసాహారానికి మొగ్గు చూపుతున్నాయి. మెక్సికో.. స్పెయిన్ దేశాల్లో మాంసాహారుల సంఖ్య మూడు శాతంగా ఉందని సర్వేలో వెల్లడైంది. 2018 సంవత్సరం నాటికి దక్షిణ కోరియాలోనూ 0.9శాతం మంది శాకాహారులు ఉండగా 2021-22 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 2.5 శాతానికి పెరిగినట్లు సర్వేలో తేలింది.

ప్రపంచవ్యాప్తంగా వెజ్ డైట్ కు ఆదరణ పెరుగుతుండగా భారత్ లో మాత్రం మాంసం ప్రియుల సంఖ్య పెరుగుతుండటం విశేషం. ఏది ఏమైనా కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చిందని స్టాటిస్టా గోబల్ కన్జూమర్ చేపట్టిన సర్వే ద్వారా అర్థమవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.