Begin typing your search above and press return to search.

వివాదంలో ఆ ముఖ్యమంత్రి సతీమణి!

By:  Tupaki Desk   |   13 Dec 2022 8:30 AM GMT
వివాదంలో ఆ ముఖ్యమంత్రి సతీమణి!
X
సామాన్య ప్రజల విషయంలో లక్షా తొంబై ఆంక్షలు పెట్టే అధికారులు వీఐపీల విషయంలో మాత్రం వారు నిబంధనలకు అతీతమన్నట్టు చూసీ చూడనట్టు వదిలేస్తారనే విమర్శలు ఉన్నాయి. వీఐపీల సేవలో నిబంధనలను సైతం తుంగలో తొక్కుతారనే అభియోగాలున్నాయి. తాజాగా ఇలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌ వ్యవహారం వివాదస్పదమవుతోంది.

తాజాగా.. చెన్నై నగరం శివారు తిరువొత్తియూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయ వేడుకల్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌ పాల్గొన్నారు. ఆమె ఆలయాన్ని సందర్శించినప్పుడు వర్షం పడుతోంది. ఉత్సవమూర్తిని ఆ సమయంలో ఆలయ మాడ వీధిలో ఊరేగుస్తున్నారు. ఉత్సవమూర్తిని వానలో తడవకుండా ఉండేందుకు దేవాలయ సిబ్బంది ఛత్రం పట్టారు.

అదే సమయంలో సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్‌ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. సీఎం సతీమణి కోసం ఆలయ ఛత్రాన్ని వాడారంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు.

అందులోనూ డీఎంకేకు నాస్తిక పార్టీగా గుర్తింపు ఉంది. డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి, ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఇద్దరూ నాస్తికులే, అంటే వీరు దేవుడి ఉనికిని నమ్మరు. గతంలో రాముడు మిథ్య, రామాయణం మిథ్య అని వ్యాఖ్యానించి కరుణానిధి కలకలం రేపారు. రామసేతు కట్టడానికి రాముడేమైనా ఇంజనీరా అని కూడా కరుణ వ్యాఖ్యానించారు.

అయితే స్టాలిన్‌ సతీమణి మాత్రం దేవుడిని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆమె ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ క్రమంలో వర్షంలో సీఎం సతీమణి తడిచిపోతున్నారని ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ ఛత్రాన్ని గొడుగుగా పట్టారు.

అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని దుర్గాస్టాలిన్‌ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఉపయోగించడంపై హిందు సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది దేవాదాయ శాఖలో జరిగిన ఘోర తప్పిదమని తమిళనాడు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై దుర్గాస్టాలిన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.