Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు ఎవరూ చేయని పని చేసిన ఆ రాష్ట్ర సీఎం

By:  Tupaki Desk   |   19 July 2021 5:40 AM GMT
ఇప్పటివరకు ఎవరూ చేయని పని చేసిన ఆ రాష్ట్ర సీఎం
X
రీల్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లను కొన్ని చూపిస్తుంటారు. తాజాగా అలాంటి రీల్ సీన్ రియల్ గా చేసి చూపించి వార్తల్లోకి ఎక్కారు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీల్ని.. పదవుల్ని చేపట్టిన తర్వాత పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రులకు భిన్నంగా.. తాజాగా తన చేష్టలతో తన కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు అసోం సీఎం హిమంత విశ్వశర్మ. ఇప్పుడాయన చేసిన పని హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రాష్ట్ర ప్రజలతో పాటు.. జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చకు తెర తీసింది.

గతానికి భిన్నంగా ఈ మధ్యన అసోంలో మాదకద్రవ్యాల వినియోగం బాగా పెరిగింది. దీని బారిన పడిన యువత తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డ్రగ్స్ అంశం ప్రధాన ప్రచార అంశంగా మారింది. తన చేతికి అధికారం వచ్చినంతనే డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతానని హిమంత అదే పనిగా చెప్పేవారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనూ మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారికి.. వారి కటుంబాలకు సహాయాన్ని అందించాలని తాను డిసైడ్ అయిన విషయాన్ని వెల్లడించారు.

ఈ మాటలన్ని ఏదో ప్రచారం కోసం.. ఇమేజ్ బిల్డింగ్ కోసమో కాకుండా.. తాను చెప్పిన మాటలపై తనకున్న కమిట్ మెంట్ ను తాజాగా చేతల్లో చేసి మరీ చూపించారు. ఇటీవల కాలంలో అధికారుల దాడుల్లోనూ.. తనిఖీల్లోనూ పట్టుబడ్డ రూ.163 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను కుప్పగా పోయటమే కాదు.. బుల్డోజర్ ఎక్కించి తొక్కించారు. అంతేకాదు.. స్వయంగా ఆ డ్రగ్స్ ను స్వయంగా చితిలా పేర్చి తగల పెట్టటం ద్వారా.. మాదక ద్రవ్యాల విషయంలో తానెంత సీరియస్ గా ఉన్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

సీఎం హిమంత చేసిన పనిని పలువురు అభినందిస్తున్నారు. ఈ తరహా కమిట్ మెంట్ ను దేశంలోని మరే ముఖ్యమంత్రి ప్రదర్శించలేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తాజా చర్య సోషల్ మీడియాలో ఆయనకు సరికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చింది. వందల కోట్లు విలువైన డ్రగ్స్ ను స్వయంగా కాల్చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.