Begin typing your search above and press return to search.

భయమొద్దు..కొత్త వైరస్ లో ఆ లక్షణాలు లేవు

By:  Tupaki Desk   |   27 Dec 2020 7:45 AM GMT
భయమొద్దు..కొత్త వైరస్ లో ఆ లక్షణాలు లేవు
X
కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతోంది..ఇక అంతా సాధారణ పరిస్థితులే ఉంటాయని భావిస్తున్న వేళ కొత్తగా వచ్చిన బ్రిటన్ వైరస్ భయపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ కు అంత భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్‌రెడ్డి ఇటివల ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. కొత్త వైరస్ తీవ్ర వ్యాధిగా మారే పరిస్థితులు మాత్రం ఇప్పటివరకు కనిపించలేదని చెప్పారు. అయితే మునుపటిలా విచ్చల విడిగా తిరగడం, మాస్కులు ధరించక పోవడం వంటివి చేస్తే మాత్రం కొత్త వైరస్ ప్రబలే అవకాశం ఉందని తద్వారా మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. వ్యాధి కు సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే ..

కొత్త వైరస్ మరీ ప్రాణాంతకం కాదు. అయితే కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. అప్రమత్తంగా లేకుంటే మరణాలు సంభవించొచ్చు. అందువల్లే కొత్త వైరస్ ప్రబలకుండా అంతా జాగ్రతగా ఉండాలి. యూకేలో సెప్టెంబర్ లో కేసుల సంఖ్య పెరగడంతో పరీక్షలు జరుపగా కొత్త వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. మాస్కుల ధారణ, ఇతర పద్ధతుల్లో వైరస్ సోకకుండా అడ్డుకున్నప్పుడు ఏ వ్యాధి అయిన రూపం మార్చుకోవడం సహజమే. ఈ కొత్త వైరస్ కూడా అలాగే తన రూపాన్ని మార్చుకుంది. కొత్త వైరస్ ఆనవాళ్ళు సెప్టెంబర్లోనే బయటపడినందున ఇప్పటికే ఈ వైరస్ మూలాలు భారత్ కు చేరి ఉండొచ్చు.బ్రిటన్ ఆస్ట్రా జెనీకా టీకా ప్రస్తుతం భారత్ లోనే తయారవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఒకటి రెండు వారాల్లో సిద్ధం అయ్యే అవకాశం ఉంది.


మరో మూడు నెలలు జాగ్రత్త తప్పనిసరి

ఇప్పటికిప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వేయడం మొదలు పెట్టినా ముందు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడేవారికి, ఆ తర్వాత వృద్దులకు ఇలా దశల వారీగా వేయాల్సి ఉంది. కాబట్టి టీకా అందరికీ చేరడానికి మరో మూడు నెలల సమయం అయినా పట్టొచ్చు. అయితే అప్పటి వరకూ జాగ్రత్తలు పాటించడం అవసరం. కరోనా రూపం మార్చుకుంది కాబట్టి ఇప్పటికే సిద్ధం చేసిన టీకాలు పని చేస్తాయా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఈ వైరస్ అంతానికి ఇప్పటికే సిద్ధం అయిన టీకాలు పనిచేస్తాయి. ఒకవేళ కరోనా మరీ కొత్తగా రూపురేఖలు మారినప్పుడు టీకాలలో కూడా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో కరోనా పూర్తిగా అదుపులోకి రావడానికి మరో ఏడాది అయినా పట్టొచ్చు అని డా. కె. శ్రీనాథ్‌రెడ్డి వెల్లడించారు.