Begin typing your search above and press return to search.

రాజకుటుంబాన్ని లైట్.. సామాన్యుడ్ని సీఎం చేస్తున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   11 Dec 2022 4:30 AM GMT
రాజకుటుంబాన్ని లైట్.. సామాన్యుడ్ని సీఎం చేస్తున్న కాంగ్రెస్
X
రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించటం తెలిసిందే. ముందుగా అనుకున్న ప్రకారం గుజరాత్ లో బీజేపీ విజయం సాధించినా.. ఈ స్థాయిలో ఘన విజయం సొంతమవుతుందన్న అంచనా మాత్రం చాలామంది వేయలేదు. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం ఇంతలా ఉంటుందన్న అంచనాలు తక్కువగానే వచ్చాయి. మొత్తానికి తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ కు హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావటం ఒకింత ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పాలి.

ఇక.. ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారు? అన్న సస్పెన్స్ కు తెర దించారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ను కాంగ్రెస్ అధినాయకత్వం ఫైనల్ చేసింది. నిజానికి సీఎం కుర్చీ తనకే కావాలంటూ పట్టు పట్టిన రాజకుటుంబానికి షాకిస్తూ.. ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదన్న విషయాన్ని తేల్చి చెబుతూ సామాన్యుడైన సుఖును ముఖ్యమంత్రిని చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో.. 58 ఏళ్ల సుఖు అనూహ్యంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనున్నారు.

మొత్తం 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పాతిక మంది వరకు సుఖు వైపే ఉండటం.. అధినాయకత్వం సైతం అతడి వైపే మొగ్గు చూపుతున్న వేళ.. సీఎం కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రమ్ సింగ్ సతీమణి ప్రతిభా తన ప్రయత్నాల్ని ఆపేశారు. పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉంటే సీనియర్ నేత ముఖేష్ అగ్నిహోత్రిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. మరొకరు కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సుఖును సీఎంగా ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన సభ్యులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు ప్రతిభా సింగ్. రాష్ట్ర పరిశీలకులుగా వ్యవహరిస్తున్న ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూఫేశ్ బాఘేల్.. రాష్ట్ర ఇన్ ఛార్జి రాజీవ్ శుక్లా తో పాటు హర్యానా మాజీ సీఎం భూపీందర్ ల ముందు తమ వ్యతిరేక గళాన్ని బలంగా వినిపించారు. అయినప్పటికీ వారి ఎత్తులు పారలేదు.

మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ 40 స్థానాల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 35 స్థానాలకు కేవలం ఐదు స్థానాలే అధికంగా కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసిన సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే..విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. లా స్టూడెంట్ అయిన ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ల క్రితం అంటే 2000లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా.. 2013-19 వరకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.

ఈసారి ఎన్నికల్లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా వ్యవహరించిన ఆయన నదౌన్ నియెజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. పదిహేడేళ్ల వయసులో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని.. పార్టీ తన కోసం తీసుకున్న నిర్ణయాన్ని తాను ఎప్పటికి మర్చిపోలేనని చెబుతున్నారు. సుఖును సీఎంగా ఎంపిక చేయటంలో కాంగ్రెస్ అధినాయకత్వం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుందన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. రాష్ట్ర పార్టీలో వీరభద్ర సింగ్ కుటుంబానికి తిరుగులేని పట్టు ఉంది. ఈ రాజ కుటుంబం ఇప్పటివరకు ఆరు సార్లు ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకుంది. అందుకు భిన్నంగా సుఖుది సామాన్యమైన నేపథ్యమే అయినప్పటికీ.. ఆయన వైపే అధినాయకత్వం మొగ్గు చూపటం గమనార్హం. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే సీఎం కుర్చీని ఆశించిన ప్రతిభా సింగ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలన్న బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అందుకు భిన్నంగా సుఖు మాత్రం హైకమాండ్ ఏం చెబితే అదే తన నిర్ణయం అని తేల్చేశారు. దీంతో.. రాజరికం.. పలుకుబడిన కుటుంబం కంటే పార్టీ పట్ల విధేయత ప్రదర్శించే సుఖుకు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.