Begin typing your search above and press return to search.

లేని కాంగ్రెస్‌.. కొత్త పుడుతుందా? ఏపీ నేత‌ల ఆశ‌లు

By:  Tupaki Desk   |   2 March 2021 2:30 AM GMT
లేని కాంగ్రెస్‌.. కొత్త పుడుతుందా?  ఏపీ నేత‌ల ఆశ‌లు
X
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విష‌యం మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత పార్టీ పూర్తిగా పుట్టి మునిగింది. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగానీ.. ఎంపీగానీ గెలిచిన దాఖ‌లాలు లేవు. అయితే.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కొత్త ఉత్సాహం చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కీల‌క‌మైన విజ‌య‌వాడ‌,గుంటూరు, విశాఖ‌, రాజ‌మండ్రి, నెల్లూరు న‌గ‌రాల్లో క‌నీసం రెండు చోట్ల అయినా.. నిల‌బెట్టుకునేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న మాట‌.. ఇటీవ‌ల ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌లే.

నిజ‌మే. ఇటీవల ముగిసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 7 పంచాయ‌తీల‌ను కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు గెలుపొందా రు. వాస్త‌వానికి అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ మ‌ళ్లీ పుంజుకుంటుంద‌ని.. కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు ఓట్లేస్తార‌ని కూడా ఎవ‌రూ అనుకోలేదు. ఇక‌, పార్టీ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హా ఆలోచ‌న‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఉన్న పార్టీకి అనూహ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌లు కొత్త ర‌క్తాన్ని అందించాయ‌నే చెప్పాలి. అయితే.. ఇది న‌గ‌రాల్లో ప్ర‌తిబింబిస్తుందా? భిన్న‌మైన ఆలోచ‌న‌లు ఉన్న ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే కార్పొరేష‌న్‌లో క‌నిపిస్తుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. కానీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం క‌చ్చితంగా తాము కార్పొరేష‌న్లలో విజ‌యం సాధిస్తామ‌ని చెబుతున్నారు.

ఇక‌, కాంగ్రెస్ విజ‌యావ‌కాశాల‌ను ప‌రిశీలిస్తే.. విజ‌య‌వాడ‌లో సుదీర్ఘ కాలం పాటు.. కాంగ్రెస్ కార్పొరేష‌న్‌లో చ‌క్రం తిప్పింది. విజ‌య‌వాడ‌లో మౌలిక స‌దుపాయాల‌క‌ల్ప‌న‌లో కాంగ్రెస్ త‌ర్వాత ఆ రేంజ్‌లో కృషి చేసిన పార్టీ లేద‌నే చెప్పాలి. ఇక‌, విశాఖ‌, రాజ‌మండ్రి, నెల్లూరుల్లోనూ కాంగ్రెస్ వేసిన అభివృద్ధి నేటికీ క‌నిపిస్తుంది. దీనిని బ‌ట్టి కాంగ్రెస్ ఎంత‌లేద‌న్నా.. చిత్త శుద్ధిని నిరూపించుకుంద‌నే చెప్పాలి. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న మాత్రం పార్టీని ఇప్ప‌టికీ వేధిస్తోంది. దీనికితోడు.. మారుతున్న రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ ప‌రిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మార‌క‌పోవ‌డం కూడా పెద్ద స‌వాలుగా మారింది.

ప్ర‌త్యేక హోదా,. పోల‌వ‌రం వంటి విష‌యాల‌నుతీసుకుని కాంగ్రెస్ క‌నుక ప్ర‌చారం చేసి ఉంటే.. ప్ర‌జ‌ల్లో నిల‌బ‌డేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని ఆ పార్టీ నాయ‌కులు కూడా అంగీక‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో పాత ర‌క్తం స్థానంలో యువ‌త‌కు ప్రాదాన్యం క‌ల్పిస్తే.. కొంత మార్పు క‌నిపించే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ దిశ‌గా ఆలోచ‌న చేయాల్సిన నాయ‌కులు వీటిని వ‌దిలేసి.. భ్ర‌మ‌ల్లో ఉన్నార‌నే భావ‌న ఉంది. దీనిని ప‌క్క‌న పెట్టి క్షేత్ర‌స్థాయిలో ప‌రుగులు పెట్టిస్తే.. కొంత మార్పు క‌నిపించ‌డం ఖాయ‌మే.