Begin typing your search above and press return to search.

సినీ నటి ఆ వివాదం.. జరిగింది ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Sep 2022 2:30 AM GMT
సినీ నటి ఆ వివాదం.. జరిగింది ఇదేనా?
X
కొద్ది రోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటి అర్చన గౌతమ్‌ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. రూ.10,500 పెట్టి టికెట్‌ కొన్నా.. టీటీడీ సిబ్బంది తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆమె ఆరోపణలకు దిగింది. అంతేకాకుండా తనతో దురుసుగా ప్రవర్తించారని విమర్శలు చేసింది. ఈ వ్యవహారంపై ఒక సెల్ఫీ వీడియోను కూడా ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అందులో ఏడుస్తూ టీటీడీపై అర్చనా గౌతమ్‌ తీవ్ర విమర్శలు చేసింది.

అయితే ఘటనపై ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోలా స్పందించింది. వినాయకచవితి రోజు జరిగిన గొడవ తాలూకా వీడియోని.. ఆమె ఈ రోజు పోస్ట్‌ చేసిందని టీటీడీ చెప్పిన విషయం తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధి సిఫార్స్‌ లేఖని ఆమె తెచ్చిందని.. ఆ లెటర్‌ సమయం ముగిసిపోవడంతో బ్రేక్‌ దర్శనం ఇవ్వలేదని టీటీడీ సిబ్బంది చెప్పారు.

అయితే తాజాగా అర్చనా గౌతమ్‌ ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొట్టిపారేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అసలు ఆరోజు ఏం జరిగిందో, నిజనిజాలు ఏంటో తెలుసుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేసింది.

ఒక కేంద్ర సహాయ మంత్రి వద్ద నుంచి ఏడుగురికి దర్శనం కల్పించాలంటూ సిఫార్సు లేఖ తెచ్చారని టీటీడీ ఆ వీడియోలో తెలిపింది. ఆగస్టు 31న దర్శనం కల్పించాలని లేఖలో ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి సిఫారసు చేసినట్టే ఇందుకు సంబంధించి ఏడుగురికి రూ.300 దర్శనం టికెట్లు కేటాయిస్తూ అర్చనా గౌతమ్‌ వెంట వచ్చిన తివారీ మొబైల్‌ నంబర్‌కు మెసేజ్‌ కూడా పంపామని టీటీడీ తెలిపింది. ఆగస్టు 31 సాయంత్రమే వారు దర్శనం చేసుకున్నట్టు కూడా నిర్ధారణ అయ్యిందన్నారు.

అయితే మరుసటి రోజు మళ్లీ వచ్చి టీటీడీ కార్యాలయంలో సినీ నటి అర్చన గొడవకు దిగారని, వారించబోయిన టీటీడీ ఉద్యోగిని కొట్టారని టీటీ డీ ఆ వీడియోలో పేర్కొంది. అర్చనా గౌతమ్‌ టీటీడీ సిబ్బందిని దూషిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని టీటీడీ వెల్లడించింది. అయితే వివాదం ఎందుకులే అని రెండోసారి కూడా వారికి రూ.300 దర్శన టికెట్లు ఇవ్వబోయినా అర్చనా గౌతమ్‌ తీసుకోలే దన్నారు. పైగా టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి టీటీడీ సిబ్బంది తనపై దాడి చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారని టీటీడీ తెలిపింది. దీంతో సీఐ టీటీడీ సిబ్బందిని పిలిపించి విచారించారని.. తాము తీసిన వీడియోను చూపించగా తప్పంతా ఆమెదేనని పోలీసులు తేల్చారని వివరించింది. దీంతో అర్చనా గౌతమ్‌ అక్కడి నుంచి నిదానంగా జారుకున్నారని టీటీడీ పేర్కొంది. సెప్టెంబర్‌ 1వ తేదీకి వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్‌ కావాలంటే రూ.10,500 చెల్లించాలని.. శ్రీవాణి దర్శన టికెట్‌ పొందొచ్చని మాత్రమే టీటీడీ సిబ్బంది ఆమెకు చెప్పారని తెలిపింది. అయితే ఆమె టీటీడీ అక్రమంగా రూ.10 వేలు వసూలు చేస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చే శారని మండిపడింది.

కాగా అర్చనా గౌతమ్‌ బాలీవుడ్‌లో నటిగా కొనసాగుతూనే ఉత్తరప్రదేశ్‌ లోని హస్తినాపూర్‌ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయింది. 25 ఏళ్ల అర్చనా గౌతమ్‌ గతంలో మిస్‌ ఉత్తరప్రదేశ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. బాలీవుడ్‌ లో గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ, హసీనా పార్కర్, భారత్‌ కంపెనీ, జంక్షన్‌ వారణాసి వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.