Begin typing your search above and press return to search.

కరోనా జన్యుక్రమం మారుతోందట... మందు కనిపెట్టేదెలా?

By:  Tupaki Desk   |   4 April 2020 12:30 AM GMT
కరోనా జన్యుక్రమం మారుతోందట... మందు కనిపెట్టేదెలా?
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టే యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగిపోయింది. కరోనాకు మందు కనిపెట్టేశామని అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే ఆ మందు వినియోగంలోకి రావాలంటే... హీనపక్షం సెప్టెంబర్ దాకా ఆగక తప్పదని వారే చెప్పుకొచ్చారు. ఇలాంటి కీలక తరుణం లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ(సీసీఎంబీ) మాజీ డైరెక్టర్ మోహనరావు ఓ బాంబు లాంటి వార్తను వినిపించారు. మిగిలిన ప్రాణుల మాదిరిగా కరోనా వైరస్ తనలోని జన్యు క్రమాన్ని మార్చేస్తుందట. మరి ఓ రకమైన జన్యు క్రమాన్ని ఆధారంగా చేసుకుని మందును కనిపెడితే.. అప్పటిలోగా కరోనా తన జన్యు క్రమాన్ని మార్చేస్తే... ఆ మందు పనిచేయదు కదా.

ఏ హానీకారక జీవిని అయినా నశించేలా చేయాలంటే.. దానిలోని జన్యు క్రమంపై దెబ్బ కొట్టే దిశగా మందును కనిపెడుతున్న విషయం తెలిసిందే కదా. మరి కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన జీన్స్ ను మార్చుకుంటూ పోతుంటే... దానికి విరుగుడును కనిపెట్టడం ఎప్పటికి సాధ్యమయ్యేనూ? అసలు సాధ్యపడుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే.. కరోనా తన జన్యు క్రమాన్ని మార్చేసుకుంటూ సాగుతుంటే... అసలు దానిని అరిట్టేదెలా?... సో.. మొత్తంగా మోహనరావు నిజంగానే బాంబులాంటి వార్తనే వెల్లడించారు. అయితే కరోనా అయినా, మిగిలిన ఏ జీవి అయినా తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పోతున్నా... దానికి విరుగుడు కనిపెట్టడం అంత కష్టమైన పనేమీ కాకున్నా... అందుకు కొంత సమయం పడుతుందని మోహనరావు చెప్పుకొచ్చారు.

చైనాలోని వూహాన్‌లో పుట్టి.. ఒకరి తర్వాత మరొకరికి సోకుతూ.. ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్‌ ఇప్పటిదాకా ఏకంగా పది లక్షల మందికి పైగా సోకింది. ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కు విరుగుడు కనిపెట్టేందుకు పెద్దఎత్తున అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కరోనా నిర్ధారణ పరీక్షలను సీసీఎంబీ ఇప్పటికే ప్రారంభించింది. దీంతోపాటు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని కనుగొని, దానిలో వస్తున్న మార్పులను గుర్తించడానికి సంబంధించిన పరిశోధనలను కూడా సీసీఎంబీ ప్రారంభించేసింది. జన్యుక్రమం కనుగొనగాని దాని ఆధారంగా.. వైరస్‌పై ఏయే మందులు పనిచేస్తాయో తెలుసుకునే పనిలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ క్రమంలో ఆ సంస్థకు చెందిన మాజీ డైరెక్టర్‌ మోహనరావు... కరోనా జన్యు క్రమం మారుతున్న విషయాన్ని వెల్లడించడం తో పాటుగా దానికి మందును కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని, అయితే అధిక సమయం పడుతుందని చెప్పడం కొంత ఆందోళన కలిగిస్తోందని చెప్పక తప్పదు.