Begin typing your search above and press return to search.

శ్మ‌శానంలో క‌ద‌లిన శవం.. త‌ర్వాత‌?

By:  Tupaki Desk   |   30 April 2021 1:30 AM GMT
శ్మ‌శానంలో క‌ద‌లిన శవం.. త‌ర్వాత‌?
X
ఓ వృద్ధురాలు చ‌నిపోయింద‌ని వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తూ శ్మ‌శానానికి తీసుకెళ్లారు. కానీ.. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత బాడీలో తేడా వ‌చ్చింది. ప‌రిశీలిస్తే ప్రాణాల‌తో ఉంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ కు చెందిన ల‌క్ష్మీభాయ్ వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి తీవ్రం కావ‌డంతో ఆసుప‌త్రిలో చేర్చారు. అధికారులు కొవిడ్ టెస్టుతోపాటు ప‌లు ప‌రీక్ష‌లు చేశారు. కొవిడ్ రిపోర్టు నెగెటివ్ వ‌చ్చింది. అయితే.. హృద‌య స్పంద‌న‌ల‌కు సంబంధించిన ఈసీజీలో రిపోర్టు ‘నిల్’ అని వచ్చింది.

అంటే.. స్పందనలు లేవు అని తేలింది. దీంతో.. లక్ష్మీభాయ్ చనిపోయినట్టు వైద్యలు నిర్ధారించారు. ఆమె మనవరాలు కూడా అదే ఆసుప‌త్రిలో ప‌నిచేస్తోందట‌. రిపోర్టులు చూసిన ఆమె కూడా చ‌నిపోయింద‌ని భావించింద‌ట‌. దీంతో.. కుటుంబ స‌భ్యులు ల‌క్ష్మీభాయ్ ను శ్మ‌శానానికి తీసుకెళ్లారు. ఆమెకు ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించేందుకు సిద్ధం అవుతుండ‌గా.. ఆమె శ‌రీరం మాత్రం ఇంకా వేడిగానే ఉండ‌డాన్ని మ‌న‌వ‌రాలు గ‌మ‌నించింద‌ట‌.

వెంట‌నే.. వేరే డాక్ట‌ర్ ను పిలిపించి ప‌ల్స్ మీట‌ర్ ద్వారా ప‌రీక్షిస్తే.. ఆక్సీజ‌న్ స్థాయి 85గా న‌మోదైంద‌ట‌. వెంట‌నే ల‌క్ష్మీభాయ్ ను ఆసుప‌త్రికి త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంబులెన్స్ ను పిలిపించారు. కానీ.. అప్ప‌టికే ఆల‌స్యం కావ‌డంతో.. మార్గం మ‌ధ్య‌లోనే ఆమె క‌న్నుమూశారు. దీంతో.. బంధువులు ఆసుప‌త్రి వైద్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈసీజీ టెస్టు స‌రిగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే.. త‌మ బామ్మ చ‌నిపోయింద‌ని ఆందోళ‌న చేశార‌ట‌.