Begin typing your search above and press return to search.

300 మంది భారతీయ టెకీల‌ను బంధించి సైబ‌ర్ నేర‌స్తులుగా మార్చేసిన ఆ దేశం!

By:  Tupaki Desk   |   24 Sep 2022 10:01 AM GMT
300 మంది భారతీయ టెకీల‌ను బంధించి సైబ‌ర్ నేర‌స్తులుగా మార్చేసిన ఆ దేశం!
X
సాఫ్ట్ వేర్ రంగంలో మ‌న భారతీయుల స‌త్తా ప్ర‌పంచంలో అన్ని దేశాల‌కు తెలిసిందే. ప్ర‌పంచ దిగ్గజ సంస్థ‌ల‌కు భారతీయులు సీఈవోలుగా ఉన్నారు. ట్విట్ట‌ర్‌కు పరాగ్ అగ‌ర్వాల్, అడోబ్ కు శంతను నారాయ‌ణ‌న్‌, గూగుల్ కు సుంద‌ర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు స‌త్య నాదెళ్ల వంటివారు సీఈవోలుగా కొన‌సాగుతున్నారు. వీరే కాకుండా వివిధ అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు సీఈవోలుగా మ‌రికొంత‌మంది భారతీయులు కూడా ఉన్నారు.

దీంతో భార‌త టెకీల‌పై ప‌లు దేశాలు వ‌ల వేస్తున్నాయి. భార‌తీయుల ప్ర‌తిభ‌ను వాడుకోవ‌డానికి ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌ని వ‌ల వేసిన ఒక ముఠా చేసిన ప‌ని ఇప్పుడు భార‌త టెకీల‌ను వణికిపోయేలా చేస్తోంది. వివ‌రాల్లోకెళ్తే.. మ‌న స‌రిహ‌ద్దు దేశ‌మైన‌ మయన్మార్‌కు చెందిన ఓ ముఠా ఉద్యోగాల పేరుతో భారతీయ టెకీలకు వల విసిరింది. థాయ్‌లాండ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల‌ని 300 మందిని భార‌తీయుల‌ను నియ‌మించుకుని ఆ త‌ర్వాత వారిని బంధించింది. వారితో ఆన్‌లైన్ లో సైబ‌ర్ నేరాలు చేయిస్తోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 300 మంది భార‌తీయ టెకీల కిడ్నాప్ వెనుక‌ ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న చైనా వ్యాపార వేత్త షీ జిజాంగ్ ఉన్నారనే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో షీ జిజాంగ్‌కు చెందిన మైవడీ ప్రాంతంలో 300 మంది భారతీయులు బందీలుగా ఉన్నార‌ని వార్తలు వ‌చ్చాయి. అందులో త‌మిళ‌నాడుకు చెందిన‌వారు 50 మంది, కేర‌ళ వాళ్లు 30 మంది ఉన్నార‌ని అంటున్నారు. ఇక మిగిలిన‌వారంతా వివిధ రాష్ట్రాల‌కు చెందిన‌వార‌ని స‌మాచారం. ఆ టెకీలు త‌ప్పించుకోకుండా చుట్టూ ప్రహరీ గోడలు, స్నిప్పర్ రైఫిళ్లతో కాపు కాసే గార్డులతో రోజుకు 16 గంటలు గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని అక్క‌డ నుంచి త‌ప్పించుకున్న ఒక టెకీ మీడియా ముందు ఈ దారుణాన్ని వివ‌రించ‌డంతో ఈ ఘాతుకం వెలుగులోకి వ‌చ్చింది. ఎలాగోలా మీడియా ముందుకు వచ్చాన‌ని.. ఇప్పుడు తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆ టెకీ వెల్ల‌డించాడు. పాస్‌పోర్టు లాక్కున్నార‌ని.. మొబైల్ వాడకంపై ఆంక్షలు విధించారని వాపోయాడు. ఎదురుతిరిగి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆ టెకీ ఆరోపించాడు.

'మేము ఇప్పుడు బానిసలం.. బతికి ఉండాలంటే ప్రతీరోజు పెద్ద ఎత్తున డేటాను దొంగిలించాల్సి ఉంటుంది' అని ఆ టెకీ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌మ‌తో ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు చెందిన డేటా చోరీ చేయించారని వివరించాడు. వారి ఆదేశాలు పాటించకపోతే లాఠీలతో కొడ‌తార‌ని విల‌పించాడు. చీకటి గదిలో నిర్బంధించి తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని గోడు వెళ్లబోసుకున్నాడు. త‌మ‌ను విడుదల చేయాలంటే క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేయాలని చెప్తున్నారని వివ‌రించాడు. ఇలా ఓ హైదరాబాద్ యువకుడు క్రిప్టో క‌రెన్సీలో వారికి డ‌బ్బులు చెల్లించి బయటపడ్డాడని తెలిపాడు.

కేరళకు చెందిన‌వారిని డేటా ఎంట్రీ జాబుల పేరిట నిందితులు ట్రాప్ చేశార‌ని ఆ టెకీ వివ‌రించాడు. టెకీలు థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్ చేరుకున్నాక ఎయిర్ పోర్టు వద్ద పికప్ చేసుకొని తర్వాత మయన్మార్‌కి తరలించారని తెలిపాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తమను విడిపించాలని కోరాడు. ఈ వ్య‌వ‌హారంపై హైద్రాబాదుకు చెందిన ఎంబీటీ నేత అజ్మద్ ఉల్లాహ్ ఖాన్ మాట్లాడుతూ.. బందీలుగా ఉన్నవారిలో 9 మందిని క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేసి విడిపించామన్నారు. మిగతా వారిని తొందరగా విడిపించేలా కేంద్ర ప్ర‌భుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విన్న‌వించారు.

కాగా 300 మంది భారతీయులను ముందుగా వారిని విజిట్ వీసాపై దుబాయ్ తీసుకెళ్లి త్వరలోనే ప్రాజెక్ట్ సైట్‌కి తరలిస్తామని చెప్పారు. త‌ర్వాత బ్యాంకాక్‌కు అక్క‌డ నుంచి మయన్మార్ కు కార్ల‌లో తెలియ‌ని ప్ర‌దేశాల‌కు తీసుకెళ్లార‌ని అంటున్నారు. అక్క‌డ నుంచి మ‌ళ్లీ ప‌డ‌వ‌ల్లో అత్యంత కాపలా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లిపోయి బంధించార‌ని తెలుస్తోంది.

నిందితులు చెప్పేదాని ప్ర‌కారం.. 'ప్రాజెక్ట్ సైట్'లో, భారతీయులు అమ్మాయిలుగా నటిస్తూ నెటిజన్లను ట్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయ‌డానికి ఇష్ట‌ప‌డిన టెకీల‌ను కొట్ట‌డం, తుపాకీతో బెదిరించ‌డం చేశార‌ని చెబుతున్నారు. అంతేకాకుండా క‌రెంటు షాక్ ఇచ్చి భ‌య‌పెడుతున్నార‌ని అంటున్నారు. మ‌రో వైపు బాధితుల వద్ద ఆ ముఠా ఫోన్లు లాగేసుకుంది.

కాగా ఒక నివేదిక ప్ర‌కారం.. మయన్మార్, థాయ్‌లాండ్‌లోని ఏజెంట్లు ఇటీవల ఇటువంటి ఉద్యోగాల కోసం భారతీయులను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. ఇంతకుముందు, వారు చైనీస్ మరియు మలేషియన్లను నియమించుకున్నారు, కానీ ఇప్పుడు, వారు చౌక కార్మికులుగా పరిగణించి భారతీయ టెకీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు తెలిపాయి.

ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. మ‌య‌న్మార్‌లో బందీలుగా ఉన్న భార‌తీయుల‌ను విడిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అక్క‌డ ఏజెంట్ల చేతిలో మోసానికి గురై 60 మంది టెకీలు బందీలుగా ఉన్నార‌న్నారు. కాగా ఇప్ప‌టికే మ‌య‌న్మార్ రాజ‌ధాని యాంగూన్‌లో భారత రాయబార కార్యాలయం వారిని రక్షించడానికి మయన్మార్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది.

"ఇప్పటి వరకు, దౌత్య కార్యాలయం మైవడ్డీ ప్రాంతంలో చిక్కుకున్న 30 మందికి పైగా భారతీయ పౌరులను రక్షించింది. వీలైనంత త్వరగా ఇతరులను కూడా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని భార‌త రాయ‌బార కార్యాల‌యం ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.