Begin typing your search above and press return to search.

కరోనా పుట్టిన దేశంలో మరోమారు కల్లోలం!

By:  Tupaki Desk   |   11 Nov 2022 7:12 AM GMT
కరోనా పుట్టిన దేశంలో మరోమారు కల్లోలం!
X
కరోనా మహమ్మారి పుట్టిన చైనాను ఆ మహమ్మారి ఇంకా పీడిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా తన రూపాన్ని మార్చుకుని దశలవారీగా చైనాపైకి దండయాత్ర చేస్తూనే ఉంది. దీంతో చైనీయులు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. మరోవైపు జీరో వైరస్‌ కట్టడి పేరుతో చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ఇంకా ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది.

తాజాగా చైనా రాజధాని నగరం బీజింగ్, జెంగ్‌ఝౌ నగరాల్లో భారీగా కోవిడ్‌ కొత్త కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. ఒక్క శుక్రవారమే 10,535 మందికి వైరస్‌ సోకింది. ఏప్రిల్‌ 29 తర్వాత భారీ స్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

జెంగ్‌ఝౌలో ఒక్కరోజులోనే కొత్త కేసులు రెట్టింపు అవ్వడం కోవిడ్‌ తీవ్రతకు నిదర్శనం. కోవిడ్‌ విజృంభణతో అక్కడి అతిపెద్ద యాపిల్‌ అసెంబుల్‌ కేంద్రాన్ని మూసివేశారు. దీంతో చైనాలో యాపిల్‌ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇక చాంగ్‌కింగ్‌ నగరంలో కొద్ది రోజులుగా వందల సంఖ్యలోనే కోవిడ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో కేసులు తక్కువగానే ఉన్నాయి. అయినా సరే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలను అధికారులు వాయిదా వేశారు. జెంగ్‌ఝౌ, చాంగ్‌కింగ్‌ నగరాల్లో దాదాపు 50 లక్షల మంది లాక్‌డౌన్‌లో ఉండటం గమనార్హం.

కాగా ప్రస్తుతం చైనాలోని పెద్ద నగరాల్లో ఒకటైన గాంగ్‌ఝౌ నగరం కరోనా వైరస్‌ కేంద్రంగా మారింది. అక్కడ కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి.

మరోవైపు జనాభా అధికంగా ఉన్న హైఝు నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కఠిన లాక్‌డౌన్‌ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక బీజింగ్, జెంగ్‌ఝౌ, చాంగ్‌కింగ్‌ నగరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.

కొద్ది నెలల క్రితం షాంఘై నగరంలో విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.