Begin typing your search above and press return to search.

కోవిడ్ ఎఫెక్ట్.. మహిళలు మద్యం ప్రియులేనట..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 2:30 PM GMT
కోవిడ్ ఎఫెక్ట్.. మహిళలు మద్యం ప్రియులేనట..!
X
కరోనా మహమ్మరి ప్రపంచాన్ని రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. కోవిడ్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాకే యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ కరోనా వేరియంట్ల రూపంలో సవాళ్లు విసిరింది. ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కరోనా టీకాలు వేయించడం ద్వారా ఈ మహమ్మరి క్రమంగా తగ్గుముఖం పట్టింది.

కరోనా పిక్స్ లో ఉన్నప్పుడు రోజుకు లక్షల్లో కేసులు నమోదయ్యేవి. అగ్ర దేశాలైన అమెరికా.. బ్రిటన్.. ఇటలీ.. చైనా తదితర దేశాలు సైతం కరోనాను నిలువరించలేక చతికిలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్ డౌన్.. పాక్షిక లాక్డౌన్లు విధించి తమ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేశాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కరోనా ఎఫెక్ట్ తో నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో అనేకమంది రోడ్డునపడాల్సి వచ్చింది. నిరుద్యోగం నానాటికీ పెరగడంతోపాటు ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు మాస్కులు లేకుండా బయట తిరిగే పరిస్థితులు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కల్చర్ వెలుగులోకి వచ్చింది. ఈ కాలంలో ఈ కల్చర్ ఉద్యోగులు, వ్యాపారులకు బాగా కలిసి వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాలకు వెళ్లి మునుపటిలా పనులు చేస్తున్నారు. ఇదే సమయంలో పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తుండటం ఆందోళన రేపుతోంది.

కోవిడ్ కాలంలో చాలామంది మహిళలు గృహహింస బారిన పడ్డారు. మహిళలు ఇళ్లకే పరిమితం కావడంతో వారికి పని భారం పెరిగింది. ఉద్యోగుల చేసే మహిళలకు పని భారం రెట్టింపు కావడంతో చాలా మంది డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ కాలంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగాయంటే కరోనా నాటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఒత్తిడిని దూరం చేసుకునే క్రమంలో మహిళలు మద్యానికి బానిసలుగా మారినట్లు వెల్లడైంది. ఢిల్లీలోని కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ అనే ఎన్జీవీ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లో కోవిడ్ తర్వాత మహిళలు ఎక్కువగా మద్యాన్ని సేవిస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. సుమారు 5వేల మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించగా షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

37 శాతం మంది మహిళలు మద్యపానం సేవించడం పెరిగిందని తెలిపారు. అలాగే 42.3 శాతం మంది మహిళలు అప్పుడప్పుడు మాత్రమే మద్యం ఎక్కువగా సేవిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు ఎక్కువగా మద్యం సేవించడానికి ఒత్తిడితోపాటు మద్యం విరివిగా లభించడమే కారణమని సర్వేలో తేలింది. నగరాల్లో పెరుగుతున్న పబ్బు కల్చర్ కూడా ఇందుకు కారణమని మరికొందరు తెలిపారు.

కాగా మహిళలు అతిగా మద్యం సేవించడం వల్ల వారిలో అనేక దుష్ఫలితాలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మోనోపాజ్ సమస్యతోపాటు ఎముకలు ధృఢత్వం కోల్పోవడం.. వంధ్యత్వం.. క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఏదిఏమైనా కోవిడ్ తర్వాత మహిళలు మగవారికి ధీటుగా మద్యాన్ని సేవిస్తుండటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.