Begin typing your search above and press return to search.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

By:  Tupaki Desk   |   1 Nov 2021 5:03 AM GMT
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
X
గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్దేవ్ బాబా.. దేశీయ ఆవుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దేశీయ ఆవుల రక్షణకు పతంజలి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశీయ గోవుల పునరుత్పత్తి, సంరక్షణకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమని ప్రకటించారు.

ఆయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని అనుకున్నామా అలాగే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం ఖాయమని పేర్కొన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సాధువులంతా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సీఎం జగన్ కోరాలని చెప్పారు. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేందుకు స్వామీజీలందరూ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ టీటీడీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. గో సంరక్షణకు పతంజలి పీఠం ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు.

తిరుపతిలో నిర్వహించిన గో సమ్మేళనం చేసిన ఈ విజ్ఞప్తి వారిద్దరి చెవిలో చేరేలా గో ప్రేమికులు నినదించాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను బాబా రాందేవ్ అభినందించారు. గోమాత సంర‌క్ష‌ణ కోసం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ములు ప్రారంభించిన ఉద్యమం విశ్వ‌వ్యాప్తం కావాల‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర్వ‌స్వ‌తి ఆకాంక్షించారు. శ్రీ‌వారి సంక‌ల్పంతో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రారంభించిన గోసంర‌క్ష‌ణ య‌జ్ఞం త‌ప్ప‌క విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని ఆశీర్వ‌దించారు

శృంగేరి శార‌ద‌ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విధుశేఖ‌రభార‌తి స్వామి వీడియో సందేశం ద్వారా అనుగ్ర‌హ భాష‌ణం చేశారు. గోసంర‌క్ష‌ణ‌తోనే హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ జ‌రుగుతుంద‌ని, ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. భార‌తదేశంలో అనేక సంప్ర‌దాయాలు ఉన్నా, హిందూ ధ‌ర్మం గొప్ప‌ద‌ని, స‌నాత‌న హిందూ ధ‌ర్మానికి హాని జ‌రిగే ప‌రిస్థితి ఏర్ప‌డితే హిందువులంద‌రూ ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు. గోమాత‌ను జాతీయ‌ప్రాణిగా ప్ర‌క‌టించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుకున్నారు.

టిటిడి అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తున్న బియ్యం, బెల్లం, ప‌సుపు లాంటి ముడిస‌రుకుల‌న్నీ రాబోయే రోజుల్లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన రైతుల నుంచే కొనుగోలు చేస్తామ‌ని టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. గోమాత‌ను ర‌క్షిస్తూ, సేవిస్తూ త‌ద్వారా భూమాత‌ను కాపాడితే ప్ర‌పంచం సుభిక్షంగా ఉంటుంద‌ని, మాన‌వాళి మొత్తం ఆరోగ్యంగా ఉంటార‌ని స‌మాజానికి మ‌రోసారి తెలియ‌జెప్ప‌డానికి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆదేశంతోనే ఆయ‌న పాదాల చెంత ఉన్న మ‌హ‌తి ఆడిటోరియంలో ఈ రెండు రోజుల జాతీయ గోమ‌హాస‌మ్మేళ‌నం నిర్వ‌హించిన‌ట్టు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు.