Begin typing your search above and press return to search.

చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతికాడు !

By:  Tupaki Desk   |   22 Nov 2021 2:30 PM GMT
చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతికాడు !
X
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. వారి కుటుంబాలకు తీరని వేదన మిగిలిస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చిన ఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఇది అలాంటిదే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన ఓ వ్యక్తి, పోస్టుమార్టం టైమ్ కు బతికాడు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. మొరాదాబాద్ లోని పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న 40 ఏళ్ల శ్రీకేష్ కుమార్.

ఎప్పట్లానే విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న శ్రీకేష్ ను రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. వెంటనే శ్రీకేష్ ను దగ్గర్లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్య పరీక్షల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడని ధృవీకరించారు వైద్యులు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలోని ఫ్రీజర్‌ లో ఏడు గంటల పాటు ఉంచారు. తరువాతి రోజు శవ పరీక్షకు అంగీకరిస్తూ కుటుంబసభ్యులు పంచనామాపై సంతకాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో శ్రీకేష్ మరదలు అతడి మృతదేహాన్ని చూసి షాక్‌ కు గురైంది.

శ్రీకేష్‌ ఊపిరి ఆడుతున్నట్లు గుర్తించింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. వారు హుటాహుటిన వైద్యులకు సమాచారం చేరవేయడంతో వైద్యులు అప్రమత్తమై శ్రీకేష్‌‌ ని ఫ్రీజర్ నుంచి బయటకు తీసి చికిత్స అందించారు. అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో కుటుంబసభ్యులు కుదుటపడ్డారు. చనిపోయాడనుకుని భావించిన శ్రీఖేష్ మృత్యుంజయుడిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా, మరణించాడని ధృవీకరించిన డాక్టర్ల పై ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర చర్యలు తీసుకుంది.