Begin typing your search above and press return to search.

మోడీ హ‌యాంలో బ్యాంకులు ర‌ద్దు చేసిన రుణ‌మెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   9 May 2019 4:55 AM GMT
మోడీ హ‌యాంలో బ్యాంకులు ర‌ద్దు చేసిన రుణ‌మెంతో తెలుసా?
X
నెల‌లో మూడుసార్ల‌కు మించి బ్యాంకు ఏటీఎం వాడితే.. ఒక్కో దానికి రూ.30 చొప్పున బాదేస్తుంటారు. మ‌న డ‌బ్బుల్ని బ్యాంకు ఖాతాల్లో దాచి పెట్టి.. అవ‌స‌రానికి డ‌బ్బులు తీసుకునేందుకు సైతం ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి. అంతేనా.. బ్యాంకులో ఒక నెల‌లో ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే డ‌బ్బులు డిపాజిట్ చేయాలి. అలా కాకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా డ‌బ్బులు జ‌మ చేసినా.. అద‌న‌పు ఛార్జీలు చెల్లించాల్సిందే. అదే స‌మ‌యంలో బ్యాంకుల నుంచి డ‌బ్బులు వెన‌క్కి తీసుకున్నా.. ఛార్జీల భారం త‌ప్ప‌దు. ఇదే కాదు.. చెక్ బుక్ ద‌గ్గ‌ర నుంచి బ్యాంకుకు సంబంధించి ఏ సేవ పొందాల‌న్నా.. అందుకు ఎంతోకొంత మొత్తాన్ని చెల్లించ‌క త‌ప్ప‌దు.

మ‌రింత‌లా ప్ర‌జ‌ల ముక్కు పిండి వ‌సూళ్లు చేసే బ్యాంకులు.. తాము ఇచ్చిన అప్పుల్ని వ‌సూలు చేసే విష‌యంలో ఎంత మొండిగా ఉంటాయో తెలిసిందే. సామాన్యుడు ఒక బ్యాంకులో ప‌దేళ్ల నుంచి ఖాతా ఉన్నా.. ల‌క్ష లోన్ కోసం వెళితే.. స‌వాల‌క్ష సందేహాల్ని తీర్చి.. ప‌దుల సంఖ్య‌లో పేప‌ర్ల‌ను స‌మ‌ర్పించిన త‌ర్వాతే బ్యాంకు నుంచి డ‌బ్బులు చేతికి అందుతుంటాయి.

సామాన్యుల విష‌యంలో ఇంత క‌చ్ఛితంగా ఉండే బ్యాంకులు.. కొన్ని కంపెనీలు.. సంస్థ‌ల విష‌యంలో ఎంత ఉదారంగా ఉంటాయ‌న్న విష‌యాన్ని కొన్ని గ‌ణాంకాలు చూస్తే అర్థం కావ‌ట‌మే కాదు.. అవాక్కు అయ్యే ప‌రిస్థితి. ఏంది? బ్యాంకులు ఈ స్థాయిలో మొండిబ‌కాయిల‌ను ర‌ద్దు చేస్తాయా? అన్న సందేహం రాక మాన‌దు. ఎంత ప్ర‌య‌త్నించినా.. వ‌సూలు కాని మొండి బ‌కాయిల విష‌యంలో బ్యాంకులు ర‌ద్దు చేయ‌టం కొత్తేం కాకున్నా.. గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఇలా ర‌ద్దు చేసిన మొండిబ‌కాయిల లెక్క చూస్తే.. ఆందోళ‌న‌కు గురి కావ‌టం ఖాయం.

ఐదేళ్ల మోడీ ప్ర‌భుత్వ హ‌యాంలో మొండి బ‌కాయిల్ని త‌క్కువ‌గా చేసి చూపించాల‌న్న అతృత‌తో బ్యాంకులు వ్య‌వ‌హ‌రించిన తీరు గుండెలు అదిరిపోయేలా మార‌తాయి. రుణాలు ఇచ్చేట‌ప్పుడు స‌వాల‌క్ష సందేహాల‌తో తాట తీసే బ్యాంకులు అంత గుడ్డిగా రుణాలు ఎలా ఇస్తాయి? బ్యాంకుల‌కు డ‌బ్బులు క‌ట్ట‌లేమ‌నే పెద్ద మ‌నుషుల విష‌యంలో బ్యాంకులు ఏం చేశాయ‌న్న‌ది చూస్తే.. ఏమీ క‌నిపించ‌దు.

ప‌దేళ్ల వ్య‌వ‌ధిలో మొత్తంగా రూ.7ల‌క్ష‌ల కోట్ల మొండిబ‌కాయిల్ని బ్యాంకులు ర‌ద్దు చేస్తే.. గ‌డిచిన ఐదేళ్ల‌లో వీటి సంఖ్య భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. గ‌డిచిన ఐదేళ్ల‌లో రూ.5.55 ల‌క్ష‌ల కోట్ల మొండి బ‌కాయిల్ని బ్యాంకులు ర‌ద్దు చేసిన వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత భారీ మొత్తం కేవ‌లం 300 సంస్థ‌ల‌కు చెందిన మొండి బ‌కాయిల్ని ర‌ద్దు చేసేందుకు కావ‌టం గ‌మ‌నార్హం. దేశానికి చౌకీదార్ గా ఉండే వ్య‌క్తి అధికారంలో ఉన్న‌ప్పుడు అప్ప‌లు తీసుకొని ఎంత‌కూ తీర్చ‌ని బ‌డాబాబుల సంగ‌తిని ఎందుకు చూడ‌న‌ట్లు..?

గుండెల అదిరిపోయేలా ఉండే.. బ్యాంకు ర‌ద్దు చేసిన మొండిబ‌కాయిల గ‌ణాంకాల్ని చూస్తే..

+ రూ.1,08,374 కోట్లు: 2016-17లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం
+ రూ. 1,61,328 కోట్లు: 2017-18లో రద్దు చేసిన రుణాలు. అంత‌కు ముందు ఏడాదితో పోలిస్తే 50% ఎక్కువ‌.
+ రూ.64,000 కోట్లు: 2018లో అక్టోబ‌రు - డిసెంబ‌రు మ‌ధ్య మూడు నెల‌ల కాలంలో ర‌ద్దు చేసిన రుణాలు
+ రూ.1,56,702 కోట్లు: 2018లో తొమ్మిది నెల‌ల కాలంలో ర‌ద్దు చేసిన రుణాల మొత్త‌మిది
+ రూ.5,55,603 కోట్లు: ఐదేళ్ల మోడీ స‌ర్కారు హ‌యాంలో బ్యాంకులు ర‌ద్దు చేసిన రుణాలివి.
+ రూ.7 లక్షల కోట్లు: గత పదేళ్లలో బ్యాంకులు రైటాఫ్‌ చేసిన మొత్తం రుణాలు. ఇందులో ఒక వంతు మోడీ స‌ర్కారుకు ముందు వారు ర‌ద్దు చేస్తే.. ఐదేళ్ల వ్య‌వ‌ధిలో నాలుగు వంతుల రుణాల్ని మోడీ స‌ర్కార్ ర‌ద్దు చేయ‌టం గ‌మ‌నార్హం.